కేరళ మలప్పురంలో గర్భంతో ఉన్న ఏనుగు చనిపోయిన కేసులో అటవీశాఖ అధికారులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ మేరకు కేరళ అటవీ శాఖ మంత్రి కే రాజు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గరు అనుమానితులను గుర్తించామని, మరో ఇద్దరి కోసం గాలింపు జరుగుతోందని అధికారులు తెలిపారు.
కేరళ ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్
10:39 June 05
కేరళ ఏనుగు మృతి కేసులో ఒకరు అరెస్ట్
ఇదీ జరిగింది..
మానవత్వానికే మచ్చతెచ్చే ఈ ఘటన గత నెలలో కేరళలో చోటు చేసుకొంది. గర్భంతో ఉన్న ఓ ఏనుగుతో మల్లప్పురం వద్ద ఓ గ్రామంలోని ప్రజలు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. నదిపాయల్లో ఆహారం వెతుక్కుంటూ ఓ ఆడ ఏనుగు గ్రామంలోకి వచ్చింది. కొందరు స్థానికులు దానికి ఒక పైనాపిల్ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. మనుషులను నమ్మి వారు ఇచ్చిన పండును తీసుకొని నోటపెట్టింది. అంతే.. ఆ పండు భారీ చప్పుడుతో పేలింది. ఆ మూగజీవి నోటివెంట రక్తం ధారగా కారింది. రక్తమోడుతున్న నోటితో గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉండటంతో ఆకలి.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏమి చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడంతో అక్కడే ఉండిపోయింది.
విషయం తెలుసుకొన్న అటవీశాఖ సిబ్బంది.. సురేందర్, నీలకంఠన్ అనే మరో రెండు ఏనుగులను తీసుకొచ్చి దానిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించారు. కానీ, గాయం బాధను తట్టుకోలేకపోతున్న ఆ ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27వ తేదీ సాయంత్రం 4గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం మనుషులను నమ్మినందుకు అది తన కడుపులో బిడ్డతో సహా లోకాన్ని వదిలి వెళ్లిపోయింది. హృదయ విదారకమైన ఈ ఘటనను మల్లప్పురం అటవీశాఖ అధికారి మోహన్ కృష్ణన్ తన సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించారు. చనిపోయిన ఏనుగును బయటకు తీసుకొచ్చి దానిని పరీక్షించగా అది గర్భంతో ఉందని తెలిసి వైద్యులు బాధపడ్డారు. చివరికి అటవీశాఖ సిబ్బంది దానికి అంత్యక్రియలు నిర్వహించారు