తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గతుకుల బాటలో మోటారు వాహనాల చట్టం

ఏటా అత్యధికంగా రహదారి ప్రమాదాల భ్రష్ట రికార్డును తుడిచిపెట్టేందుకంటూ కేంద్రప్రభుత్వం సరికొత్త మోటారు వాహనాల (సవరణ) చట్టాన్ని పట్టాలకెక్కించింది. ఈ చట్టం జాతీయ రవాణా విధానంతోపాటు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల విధానాల్లో మార్పుల్ని ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు శిక్షల్ని ప్రస్తావించింది. ప్రస్తుత నిబంధనల్లో 30 దాకా ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనుల జేబుకు చిల్లు, జనసామాన్యం గుండెలు గుభిల్లుమనిపించేవిగా ఉన్నాయి

By

Published : Sep 14, 2019, 4:27 PM IST

Updated : Sep 30, 2019, 2:26 PM IST

గతుకుల బాటలో మోటారు చట్టం

వేగం- ఆధునిక జీవన వేదం. సురక్షిత రవాణా విధానాల కూర్పు ద్వారా సుభద్ర రహదారి వ్యవస్థ నిర్మాణానికి చకచకా కదలాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దశాబ్దాల ఉదాసీనత- ఇండియాలో ప్రయాణానికి ప్రమాదం అన్న దురర్థాన్ని స్థిరీకరించిందన్నది యథార్థం! ప్రపంచంలోనే అత్యధికంగా ఏటా లక్షన్నర మంది అభాగ్యుల ఉసురుతీస్తున్న రహదారి ప్రమాదాల భ్రష్ట రికార్డును తుడిచిపెట్టేందుకంటూ కేంద్రప్రభుత్వం సరికొత్త మోటారు వాహనాల (సవరణ) చట్టాన్ని పట్టాలకెక్కించింది. మొత్తం 63 నిబంధనలున్న ఈ చట్టం జాతీయ రవాణా విధానంతోపాటు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ల విధానాల్లో మార్పుల్ని ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు శిక్షల్ని ప్రస్తావించింది. నామ్‌ కే వాస్తే జరిమానాలతో సరిపుచ్చిన పాత చట్టానికి చెల్లుకొట్టి తెచ్చిన నయా నిబంధనల్లో 30 దాకా ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనుల జేబుకు చిల్లు, జనసామాన్యం గుండెలు గుభిల్లుమనిపించేవే.

దేశ రాజధానిలో ట్రాఫిక్‌ పోలీసులు ఓ లారీకి వేసిన జరిమానా అక్షరాలా రెండు లక్షల రూపాయల పైమాటే! పౌరులు భయభక్తులతో చట్టాన్ని ఔదలదాల్చాలంటే, అంత భారీ జరిమానాలు ఉండాల్సిందేనని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ చెబుతున్నారు. ఈ అంశాన్ని ‘మానవతా దృక్పథం’తో చూడాలంటూ గుజరాత్‌ ప్రభుత్వం- ప్రతిపాదిత జరిమానాల్ని 25-90 శాతం దాకా తెగ్గోస్తే, తక్కిన రాష్ట్రాలూ అదే బాటలో సాగుతున్నాయి. పశ్చిమ్‌ బంగలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని మమతా దీదీ అంటుంటే, జరిమానాల మోత తగ్గించాలని మహారాష్ట్ర వంటివి కేంద్రాన్ని అభ్యర్థిస్తున్నాయి.

చట్టప్రకారం రాష్ట్రాల పరిధిలోలేని జరిమానాల్నీ సవరించిన గుజరాత్‌, కనీస ఫైన్ల నిర్దేశాన్నీ పట్టించుకోకపోవడంతో- అలా వ్యవహరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందా అని కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖను గడ్కరీ శాఖ ఆరా తీస్తోంది. రోడ్డు రవాణా ఉమ్మడి జాబితాలో ఉన్నందువల్ల ఉత్పన్నమైన సమస్య కాదిది. సవరణ బిల్లు రూపకల్పనలో ప్రత్యక్షంగా పాల్పంచుకొన్న రాష్ట్ర ప్రభుత్వాలు తీరా దాని అమలు విషయంలో నాలుక మడతేయడంతో తలెత్తింది ఈ కొత్త పేచీ!

ఏటా అయిదు లక్షల రహదారి ప్రమాదాల్లో లక్షన్నర మంది అభాగ్యులు మృత్యువాత పడుతుండగా, అంతకు మూడింతల మంది తీవ్ర క్షతగాత్రులై కుములుతున్న దేశం మనది. 2020 నాటికల్లా రహదారి ప్రమాదాలు, మృతుల సంఖ్యను సగానికి తగ్గించాలన్న బ్రసీలియా ఒడంబడికపై సంతకం చేసిన ఇండియా- అందుకు అనువైన చట్టాన్ని చేయడానికీ ఇదిగో ఇంతకాలం పట్టింది! రాష్ట్రాల అధికారాలను కబళించే ప్రసక్తే లేదన్న గడ్కరీ భరోసాకు జతపడి- ఏడు పార్టీలకు చెందిన 19 రాష్ట్రాల రవాణా శాఖా మంత్రులు సభ్యులుగా గల బృందం ఈ సవరణ బిల్లును తీర్చిదిద్దింది.

భిన్నపార్టీలకు ప్రాతినిధ్యం ఉండే పార్లమెంటరీ స్థాయీసంఘం సైతం తగు సూచనలు చేసి సమ్మతి తెలిపిన బిల్లు అది. అలాంటి చట్టాన్ని భాజపాయేతర ప్రభుత్వాల కంటే ముందే కమలం పార్టీ సర్కార్లు నీరుగార్చబోవడమే విస్తుగొలుపుతోంది. ‘ఆదాయ మార్గంగా భావించి భారీ జరిమానాలు ప్రతిపాదించలేదు. రవాణా నిబంధనలను ఔదలదాల్చే పౌర సంస్కృతి పెంచాలన్నదే లక్ష్య’మని గడ్కరీ చెబుతున్నా అది నాణేనికి ఒక పార్శ్వమే. రహదారుల నిర్మాణంలో డిజైన్ల లోపాలు, రోడ్లపై గుంతలు, ప్రమాదకర ప్రాంతాల్లో సరైన సూచికలు లేకపోవడం వంటి ప్రాణాంతక బాధ్యతారాహిత్యానికి, రవాణా కార్యాలయాల్లో అవినీతి మేటలకు బోనులో నిలబెట్టాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్నే! రోడ్లపై గుంతలు పూడ్చని స్థానిక సంస్థల నేరం 2017లో దేశవ్యాప్తంగా 3,600మంది ప్రాణాలు బలిగొంది. నిర్మాణంలో ఉన్న రోడ్లు, వాటి సమీపాన సరైన సూచికలు లేకపోవడం మరో 4,250మందిని కబళించింది. పౌరులకు బాధ్యత మప్పడానికే భారీ జరిమానాలంటున్న కేంద్రం- రహదారి భద్రతను అక్షరాలా దేవతా వస్త్రం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సర్కారీ విభాగాలకు ఏం శిక్ష విధిస్తుంది?

దేశీయంగా కేవలం అయిదు శాతం లోపు ఉన్న జాతీయ, రాష్ట్ర రహదారుల మీదే 63 శాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్న అధ్యయనాలు, మృతుల్లో 60 శాతం 18-35 ఏళ్ల మధ్య వయస్కులేనని చాటుతున్నాయి. దేశ రహదారుల మీద 726 ప్రమాదకర మలుపులు (బ్లాక్‌స్పాట్స్‌) ఉన్నాయని, వాటిని సరిచేసి భద్రమైన ప్రయాణానికి భరోసా ఇచ్చేలా రూ.11 వేలకోట్లు వ్యయీకరిస్తామని 2016 జనవరిలో గడ్కరీ ఘనంగా చాటారు. ఆ ఏడాదే మూడు వేల కిలోమీటర్ల రోడ్ల భద్రతా సమీక్ష వాగ్దానాలూ మోతెక్కిపోయాయి. వాటి విషయంలో కేంద్రం సాధించిన ప్రగతి ఏమిటి? సమస్త సర్కారీ శాఖల్లో మేట వేసిన అవినీతే, పౌరుల్లో నిష్పూచీతనానికి, పరోక్షంగా రహదారి ఉగ్రవాదానికీ ఊపిరులూదింది.

భారీ జరిమానాల బెత్తం పట్టుకొని పౌరుల్ని దారిన పెడతామంటున్న కేంద్రం- ప్రభుత్వపరంగా తక్షణం రావాల్సిన సంస్కరణలు, దిద్దుబాట్ల విషయంలో ఏం చేస్తోంది? మోటారు వాహనాల చట్టం అమలును జనవరికి వాయిదా వేసిన గోవా, ఈలోగా తన బాధ్యత అయిన రహదారి నిర్వహణను మెరుగుపరచాలని నిర్ణయించింది. ప్రజాప్రభుత్వంగా నైతిక బాధ్యతా సూత్రాన్ని మన్నించి గోవా అనుసరిస్తున్న మార్గం తక్కిన వాటన్నింటికీ అనుసరణీయమైనది. రహదారుల నిర్వహణను ప్రమాదరహితంగా తీర్చిదిద్ది, రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, వాహన సామర్థ్య ధ్రువీకరణలు తదితరాలన్నింటా అవినీతిని తుడిచిపెట్టి, భద్రతాంశాలపై తరతమ భేదాలు చూపని నిబద్ధత ప్రభుత్వాల పరంగా ప్రస్ఫుటమైతే పౌరుల నడతలోనూ మార్పు గోచరిస్తుంది. లేదంటే, కొత్త చట్టం అమలులోనూ అవినీతి గజ్జెకట్టి శాసన మౌలిక లక్ష్యానికే తూట్లు పొడుస్తుంది!

ఇదీ చూడండి:'డార్లింగ్..​ ఇంట్లో ఎవరూ లేరన్నావ్- ఇలా జరిగిందేంటి?'

Last Updated : Sep 30, 2019, 2:26 PM IST

ABOUT THE AUTHOR

...view details