71వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలకు గాను అర్హులైన వారిని పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ మేరకు మొత్తం 141 మందితో జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది. ఈ జాబితాలో ఏడుగురికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్ పురస్కారాలతో పాటు 118 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. మరణానంతరం జార్జి ఫెర్నాండెస్, అరుణ్‌జైట్లీ, సుష్మా స్వరాజ్, విశ్వేశ తీర్థ స్వామీజీలకు విశిష్ఠ పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించింది.
పీవీ సింధూకి పద్మభూషణ్
ఈ ఏడాది ఐదుగురు తెలుగు వ్యక్తులకు పద్మ అవార్డులు వరించాయి. క్రీడా విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను కేంద్రం ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించగా.. తెలంగాణ నుంచి చిన్నతల వెంకట్ రెడ్డి (వ్యవసాయం), విజయసారథి శ్రీభాష్యం (విద్య, సాహిత్యం), ఆంధ్రప్రదేశ్ నుంచి యడ్ల గోపాలరావు (కళలు), దలవాయి చలపతిరావు (కళలు)లను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. వివిధ రంగాల్లో అసమాన సేవలందిస్తూ... ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారినే ఈసారి కూడా పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేశారు.
పద్మవిభూషణ్‌కు ఎంపికైన వారు.. (7)
- జార్జి ఫెర్నాండెజ్ (బిహార్) - మరణానంతరం
- అరుణ్ జైట్లీ (దిల్లీ) - మరణానంతరం
- అనిరుధ్ జుగ్‌నౌద్ మిశ్రా (మారిషస్)
- ఎం.సీ. మేరీకోమ్ (మణిపూర్) - క్రీడలు
- చెన్నూలాల్ మిశ్రా (ఉత్తర్‌ప్రదేశ్)- కళలు
- సుష్మా స్వరాజ్ (దిల్లీ) - మరణానంతరం
- విశ్వేశ తీర్థ స్వామీజీ (కర్ణాటక) - మరణానంతరం
పద్మభూషణ్ (16) వీరికే..
- ఎం. ముంతాజ్ (కేరళ) - ఆధ్యాత్మికం
- సయ్యద్ మౌజం అలీ - (బంగ్లాదేశ్) (మరణానంతరం)
- ముజఫర్ హుస్సేన్ బేగ్ - జమ్మూకశ్మీర్
- అజయ్ చక్రవర్తి (బెంగాల్) - కళలు
- మనోజ్ దాస్ (పుదుచ్చేరి) - సాహిత్యం, విద్య
- బాలకృష్ణ దోషి - (గుజరాత్)
- కృష్ణమ్మల్ జగన్నాథన్ (తమిళనాడు) - సామాజిక సేవ
- ఎస్‌సీ జామిర్ - (నాగాలాండ్)
- అనిల్ ప్రకాశ్ జోషి (ఉత్తరాఖండ్) - సామాజిక సేవ
- సేరింగ్ లండల్ (లద్దాఖ్) - వైద్యం
- ఆనంద్ మహీంద్రా (మహారాష్ట్ర) - వాణిజ్యం, పరిశ్రమలు
- పీవీ సింధూ (తెలంగాణ) - క్రీడలు
- నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (కేరళ) ప్రజా సంబంధాలు (మరణానంతరం)
- మనోహర్ పారికర్ (గోవా) - మరణానంతరం
- జగదీశ్ సేథ్ (అమెరికా) - విద్య, సాహిత్యం
- వేణు శ్రీనివాసన్ - తమిళనాడు (వాణిజ్యం, పరిశ్రమలు)
ఇదీ చూడండి: ఈటీవీ భారత్‌కు ఓటరు అవగాహన అవార్డు!