తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని కాల్చిచంపడం ద్వారా ‘ఎన్‌కౌంటర్ నిపుణులు’గా గుర్తింపు పొందిన పోలీసు అధికారులు దేశంలో ఎందరో ఉన్నారు. నేర, మాఫియా ముఠాల పాలిట సింహ స్వప్నంలా మారిన అలాంటి కొందరు పోలీసు అధికారుల వివరాలు.
ప్రదీప్‌శర్మ
ముంబయిలో నేర సామ్రాజ్యం విజృంభించిన 1990-2000 సంవత్సరాల కాలంలో పోలీసు అధికారి ప్రదీప్‌శర్మ పేరు చెబితే మాఫియా వెన్నులో వణుకుపుట్టేది. ప్రదీప్‌శర్మ 104 మందిని ఎన్‌కౌంటర్ చేశారని అధికారిక సమాచారం. వివిధ కారణాలతో ఆయన్ని 2010లో సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్లీ ముంబయి పోలీసు శాఖలోనే పనిచేస్తున్నారు.
దయానాయక్
ఎన్‌కౌంటర్ అనగానే ముంబయిలో దయానాయక్ పేరు గుర్తుకొస్తుంది. ఆయన 83 మంది నేరస్థుల్ని కాల్చేశారు. అయితే తనని ఎన్‌కౌంటర్ నిపుణుడిగా పిలిస్తే ఆయన ఒప్పుకోరు. చోటానాయక్ మాఫియా ముఠాతో 1997లో రెండుసార్లు జరిగిన ఎదురుకాల్పుల్లో దయానాయక్ గాయపడ్డారు. ఆయన జీవితం ఆధారంగా ‘అబ్‌తక్ చప్పన్’, ‘డిపార్ట్‌మెంట్’ అనే రెండు హిందీ సినిమాలు తీశారు.
ప్రఫుల్ బన్సాలె
ముంబయి నేర సామ్రాజ్యం వెన్ను విరవడంలో మరో పేరుగాంచిన అధికారి. ఏదైనా కేసు దర్యాప్తును అప్పగిస్తే చక్కగా పరిష్కరిస్తారనే పేరుంది. ప్రపుల్ బన్సాలె 84 సార్లు వివిధ ఎన్‌కౌంటర్లలో పాల్గొన్నారు.
రాజ్‌బీర్ సింగ్
దిల్లీలో 50 మందిని వేర్వేరు ఘటనల్లో ఎన్‌కౌంటర్ చేసిన రాజ్‌బీర్‌సింగ్ అక్కడి భూ మాఫియాపై ఉక్కుపాదం మోపారు. ఆస్తి సంబంధ గొడవలో దురదృష్టవశాత్తు తన చిరకాల స్నేహితుడి చేతిలో హత్యకు గురయ్యారు.
విజయ్ సావర్కర్
ముంబయిపై 2008లో ఉగ్రవాదులు చేసిన పాశవిక దాడిలో విజయ్ సావర్కర్ అమరుడయ్యారు. అంతకుముందు ఆయన 83 మంది గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్ చేశారు.