తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌరసత్వ సవరణ బిల్లుపై అపోహలు, వాస్తవాలు'

దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది పౌరసత్వ సవరణ బిల్లు. ఇటీవల ఈ బిల్లు లోక్​సభలో ఆమోదం పొందింది. నేడు రాజ్యసభ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ బిల్లుపై వస్తోన్న విమర్శలను ఎదుర్కొనేందుకు సమగ్ర వివరణ ఇచ్చింది కేంద్రం.

CAB
పౌరసత్వ సవరణ బిల్లు

By

Published : Dec 11, 2019, 7:04 AM IST

Updated : Dec 11, 2019, 9:16 AM IST

పౌరసత్వ సవరణ బిల్లుపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వాటికి అంశాల వారీగా సమాధానాలు ఇచ్చేందుకు ప్రయత్నించింది. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ఆరు మైనారిటీ వర్గాలకు చెందిన వారిని గుర్తించేందుకు ఉద్దేశించిన చట్టం ఇదని.. వారు ఆయా దేశాల్లో మతపర హింసకు గురై వలస వచ్చిన విషయాన్ని గమనంలో ఉంచుకొని అత్యంత మానవత్వంతో రూపొందించిన బిల్లు అని చెప్పింది.

అపోహ 1:ఈ బిల్లు బెంగాలీ హిందువులకు పౌరసత్వం కల్పిస్తుంది.

వాస్తవం: ఈ బిల్లు ద్వారా బెంగాలీ హిందువులకు దానంతట అదే భారత పౌరసత్వం లభించదు. పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లోని ఆరు మైనారిటీ వర్గాలకు చెందిన వారిని గుర్తించేందుకు ఉద్దేశించిన చట్టం ఇది. వారు ఆయా దేశాల్లో మతపరంగా హింసకు గురై వలస వచ్చిన విషయాన్ని గమనంలో ఉంచుకొని అత్యంత మానవత్వంతో రూపొందించిన బిల్లు ఇది.

అపోహ 2: అసోం ఒప్పందాన్ని నీరుకారుస్తుంది.

వాస్తవం: ఎట్టి పరిస్థితుల్లోనూ అసోం ఒప్పందాన్ని పౌరసత్వ సవరణ బిల్లు నీరుకార్చదు. అక్రమంగా వలసవచ్చిన వారిని గుర్తించేందుకు/వెనక్కు పంపేందుకు 1971 మార్చి 24ని కటాఫ్‌ తేదీగా గుర్తిస్తారు.

అపోహ 3: ఈ బిల్లు స్థానిక అసోం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకం.

వాస్తవం: ఇది కేవలం అసోం రాష్ట్రం కోసం రూపొందించిన బిల్లు కాదు. దేశం మొత్తానికీ వర్తిస్తుంది. అక్రమ వలసదారుల నుంచి స్థానిక తెగలను రక్షించేందుకు రూపొందించిన జాతీయ పౌరపట్టికకు ఇది వ్యతిరేకం కాదు.

అపోహ4:బెంగాలీ భాష మాట్లాడేవారి ఆధిపత్యం పెరుగుతుంది.

వాస్తవం: హిందూ బెంగాలీ జనాభాలో అత్యధికులు అసోంలోని బరాక్‌ లోయలో స్థిరపడ్డారు. ఇక్కడ బెంగాలీ రెండో భాషగా ఉంది. బ్రహ్మపుత్ర లోయలో హిందూ బెంగాలీలు అక్కడక్కడ స్థిరపడ్డారు. వారు అస్సామీ భాషనే తమ భాషగా ఎంచుకున్నారు.

అపోహ 5: బెంగాలీ హిందువులు అసోంకు పెను భారమౌతారు.

వాస్తవం: పౌరసత్వ సవరణ బిల్లు దేశం మొత్తానికీ వర్తిస్తుంది. మతపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కేవలం అసోంలో మాత్రమే స్థిరపడలేదు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నారు.

అపోహ 6: ఈ సవరణ బిల్లు వల్ల బంగ్లాదేశ్‌ నుంచి హిందువుల వలస తాజాగా మొదలౌతుంది.

వాస్తవం: ఇప్పటికే బంగ్లాదేశ్‌ నుంచి మైనారిటీలెందరో వలస వచ్చేశారు. పైగా, ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో వారిపై దౌర్జన్యాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో తాజా వలసలు తగ్గిపోయే అవకాశం ఉంది. సవరణ బిల్లులో 2014 డిసెంబరు 31ను తుదిగడువుగా నిర్ధరించినందున ఆ గడువు తర్వాత వలస వచ్చి ఉన్నవారికి ప్రయోజనాలేవీ అందవు.

అపోహ 7: హిందూ బెంగాలీలకు అవకాశం కల్పించడం ద్వారా గిరిజనుల భూములను కైవశం చేసుకునేందుకు ఈ బిల్లు ఓ కారణమౌతుంది.

వాస్తవం: హిందూ బెంగాలీల్లో అత్యధిక శాతం బరాక్‌లోయలో స్థిరపడ్డారు. ఈ ప్రాంతం అంతా గిరిజన ప్రాంతాలకు సుదూరంగా ఉంది. పైగా, గిరిజన భూముల రక్షణకు ఉద్దేశించిన చట్టాలకు ఈ బిల్లు వల్ల వచ్చిపడే ఇబ్బందేమీ ఉండదు. అవి యథాతథంగానే కొనసాగుతాయి.

అపోహ 8: పౌరసత్వ సవరణ బిల్లు ముస్లింలకు పూర్తి వ్యతిరేకం. వివక్షాపూరితం.

వాస్తవం: ప్రస్తుతం అమల్లో ఉన్న 1955 నాటి పౌరసత్వ చట్టం నిబంధనల ప్రకారం నిర్దేశిత అర్హతలుంటే ఏ మతానికి చెందిన విదేశీయుడైనా సరే భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 1955 నాటి చట్టం నిబంధనలు యథాతథంగా అలాగే కొనసాగుతాయి. ప్రస్తుత సవరణ బిల్లు వల్ల ఏ మాత్రం అవి మారవు.

ఇదీ చూడండి:నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు- ఆమోదం లాంఛనమే!

Last Updated : Dec 11, 2019, 9:16 AM IST

ABOUT THE AUTHOR

...view details