నిన్న నిర్భయ.. నేడు దిశ.. ఇలా దేశంలో మహిళలపై జరుగుతున్న ఆఘాయిత్యాలు రోజురోజుకు పెరుగుపోతున్నాయి. కానీ ఆడవారిపై అకృత్యాలకు పాల్పడుతున్న మృగాళ్లను శిక్షించే విషయంలో దేశం విఫలమవుతున్నట్టు మరోసారి రుజువైంది. 2017 ఏడాదిలో జరిగిన అత్యాచార ఘటనల వివరాలను బయటపెట్టిన జాతీయ నేర నమోదు విభాగం(ఎన్ఆర్సీబీ).. దోషులకు శిక్షపడిన కేసుల శాతం 32.2 మాత్రమేనని వెల్లడించింది.
2012లో దిల్లీలో జరిగిన నిర్భయ అత్యాచర ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ భయానక ఘటన జరిగి రేపటికి ఏడేళ్లు. మహిళలపై వేధింపుల చట్టాలను 2012 తర్వాత కఠినతరం చేసినట్లు ప్రభుత్వాలు చెబుతున్నా... అత్యాచార కేసుల్లో దోషులకు శిక్షపడిన సందర్భాలు మాత్రం చాలా తక్కువేనని ఈ గణాంకాలు పరిశీలిస్తే స్పష్టమవుతోంది.
2017 ఏడాది వివరాల మేరకు మొత్తం 1,46,201 అత్యాచార కేసులు నమోదయ్యాయి. వాటిలో 5,822 కేసుల్లో మాత్రమే దోషులకు శిక్షపడింది.
మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై ఛార్జ్‌షీట్ కూడా సరిగ్గా నమోదు కావడం లేదు. అత్యాచార కేసుల్లో నమోదైన ఛార్జ్షీట్ల శాతం 2013లో 95.4గా ఉండగా... 2017కు 86.6శాతానికి పడిపోయింది. ఫలితంగా.. అనేక కేసులు కోర్టు మెట్లు కూడా ఎక్కడం లేదు.
అవినీతే కారణం..
అవినీతి కారణంగానే అత్యాచార కేసు ఛార్జ్షీట్లు నమోదు కావట్లేదని న్యాయవాది అల్వార్ శిల్పి జైన్ అన్నారు. ఒడిశా మాజీ డీజీపీ బీబీ మొహంతీ కుమారుడు నిందితుడుగా ఉన్న అల్వార్ అత్యాచార కేసు బాధితురాలి తరఫున వాదించారు ఆమె.