తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళ తీరంలో తగ్గిన 'ఆలివ్​ రిడ్లీ' తాబేలు గూళ్లు! - కాసరగోడ్​ తీరంలో తాబేళ్ల గూళ్లు

కేరళ తీర ప్రాంతాలకు సముద్ర తాబేళ్లు వచ్చి ఏటా గూళ్లు నిర్మించుకుంటాయి. కొన్ని నెలల క్రితమే ఈ సీజన్ ప్రారంభమైనా.. ఈ సారి మాత్రం ఇప్పటికీ తాబేళ్లు అక్కడికి చేరుకోలేదు. కొన్నేళ్ల క్రితం వరకు పదుల సంఖ్యలో కనిపించే ఈ గూళ్లు.. క్రమేపీ తగ్గిపోతున్నాయి. అయితే.. మానవ తప్పిదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనికోసం ఓ స్వచ్ఛంద సంస్థ.. అంతరించిపోతోన్న తాబేళ్ల జాతికి జీవం పోసేందుకు నడుం బిగించింది.

Olive Ridley turtles fail to reach the nesting beaches in Kerala to lay eggs
కేరళ తీరంలో తగ్గిన 'ఆలివ్​ రిడ్లీ' తాబేలు గూళ్లు!

By

Published : Jan 24, 2021, 8:10 AM IST

కేరళ తీరంలో తగ్గిన 'ఆలివ్​ రిడ్లీ' తాబేలు గూళ్లు!

సెప్టెంబర్​ మాసం ప్రారంభమైందంటే చాలు.. కేరళ తీర ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆలివ్​ సముద్ర తాబేళ్లు కనువిందు చేసేవి. ఈ ఏడాది వాటి జాడే కరవైనట్టుంది! తాబేళ్లు గూడు కట్టుకునే సీజన్​ ప్రారంభమై నాలుగైదు నెలలు గడచినా.. గూళ్ల సంఖ్య మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. తీర ప్రాంతంలో గూడు కట్టుకుని గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. ఇప్పటివరకు ఆ తీరం వెంబడి కేవలం 6 గూళ్లే దర్శనమిచ్చాయి.

అయితే.. మత్స్యకారులు వేసిన ప్లాస్టిక్​ వలల్లో తాబేళ్లు చిక్కుకుని చనిపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరికొన్ని తాబేళ్లు.. గూడు కట్టుకునేందుకు తీరానికి చేరుకునే క్రమంలో ఆ భయంకరమైన వలలో పడి.. తీవ్ర గాయాలపాలవుతున్నాయని పేర్కొన్నారు. మానవ నిర్లక్ష్యం, అశాస్త్రీయ పద్ధతులలో చేపలు పట్టడం కారణంగానే ఇప్పటివరకు తాబేళ్లు తీరానికి చేరుకోలేకపోతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

తీర ప్రాంతంలో తగ్గిన గూళ్లు

ఆలివ్​ రిడ్లీ తాబేళ్లు గూళ్లు కట్టుకునే సీజన్​ సెప్టెంబర్​ నుంచి మార్చి వరకు ఉంటుంది. 18ఏళ్ల కిందట ఒక్క కాసరగోడ్​ బీచ్​లోనే సుమారు 30 తాబేళ్ల గూళ్లు కనిపించాయట. 2018కి వచ్చే సరికి వీటి సంఖ్య 15కు తగ్గింది. మరుసటి ఏడాదికి దాదాపు సగం తగ్గి.. కేవలం ఎనిమిదికే పరిమితమైంది. గత సీజన్​లో ఆ సంఖ్య ఏడుకు పడిపోయింది. ఇక ఈ సీజన్​లో మాత్రం ఇప్పటివరకు కాసరగోడ్​లో ఒకే ఒక్క గూడు కనిపించడం గమనార్హం. తయిక్కడపురంలోని బయటపడ్డ ఆ గూట్లో 150వరకు తాబేళ్ల గుడ్లు ఉన్నాయి.

ప్రత్యేక స్థావరంలో..

సాధారణంగా సముద్ర తాబేళ్లు తీర ప్రాంతంలో ఓ ప్రదేశాన్ని ఎన్నుకొని.. సుమారు 1.5 అడుగుల వరకు ఇసుకను తవ్వి ఓ గూడును నిర్మించుకుంటాయి. ఆ గోతిలో డొల్లగా ఉండే ప్రాంతంలో గుడ్లు పెడతాయి. తర్వాత ఆ ప్రదేశాన్ని ఇసుకతో జాగ్రత్తగా కప్పి ఇతర జీవుల నుంచి రక్షణ కల్పించుకుంటాయి. 40 నుంచి 60 రోజుల కాలంలో ఆ గుడ్లు పొదిగి తాబేళ్లయ్యాక సముద్రంలోకి వెళతాయి. ఇలా వాటి వంశాన్ని పెంచుకుంటాయి తాబేళ్లు.

కృత్రిమ పరిస్థితుల్లో...

అయితే ఇక్కడ తాబేళ్లు పెట్టే గుడ్లకు రక్షణ లేకుండాపోతోంది. కొందరు దుండగులు వీటిని దొంగలించుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో అంతరించిపోతోన్న ఈ తాబేళ్లను రక్షించేందుకు చర్యలు చేపట్టింది ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ. ఇందుకోసం ప్రత్యేకంగా గూళ్లను తవ్వి.. తాబేళ్లు వచ్చి గుడ్లు పెట్టేలా ఏర్పాటు చేస్తోంది. అవి వచ్చి గుడ్లు పెట్టాక.. వాటిని సేకరించి కృత్రిమ పరిస్థితుల్లో పొదిగేలా చేస్తున్నారు. ఆ తర్వాత వాటిని క్షేమంగా తీసుకెళ్లి సముద్రంలో వదిలి తాబేళ్ల జీవితానికి ప్రాణం పోస్తున్నారు.

ఇదీ చదవండి:కశ్మీరం.. ఎటు చూసినా హిమ మయం

ABOUT THE AUTHOR

...view details