తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోం ఎన్​ఆర్​సీ విడుదలకు సర్వ సన్నద్ధమైన సర్కారు - అసోం

వివాదాస్పదమైన జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ)ని ఆగస్టు 31న విడుదల చేయనుంది అసోం ప్రభుత్వం. జాబితాలో చోటు దక్కని వారు అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నందున భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. తప్పులు లేని జాబితా రూపకల్పనే లక్ష్యంగా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారని సమాచారం.

అసోం ఎన్​ఆర్​సీ విడుదలకు సర్వ సన్నద్ధమైన సర్కారు

By

Published : Aug 28, 2019, 5:32 PM IST

Updated : Sep 28, 2019, 3:16 PM IST

కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన జాతీయ పౌర జాబితా(ఎన్​ఆర్​సీ) ఆగస్టు 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తప్పులు లేని ఎన్​ఆర్​సీ ప్రకటనకు అసోం అధికార యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోందని సమాచారం.

జిల్లాలు, సర్కిల్​ స్థాయిల్లో అర్హత గల పౌరులెవ్వరూ మిగిలిపోకుండా ఉండేలా డేటా సేకరణ పూర్తి చేసిన అధికారులు సరైన జాబితా రూపొందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారని అధికార వర్గాల సమాచారం.

సరిహద్దు పోలీసు విభాగం, విదేశీ ట్రైబ్యునళ్లలో కేసులు నమోదై ఉన్నవారిని జాబితా నుంచి మినహాయించేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలను సంప్రదిస్తూ ఎన్​ఆర్​సీ నివేదికను నవీకరిస్తున్నారు.

ఎన్​ఆర్​సీ తుది జాబితాలో తమ పేర్లను ఎలా వెదకాలో రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రకటించారు.

"2018, జులై 30న విడుదల చేసిన ఎన్ఆర్​సీ నివేదికలో పేర్లు లేనివారు... 2019, జూన్ 26న ప్రచురితమైన అదనపు మినహాయింపు ముసాయిదాలో పేర్లు లేనివారు... తమను జాబితాలో చేర్చే అంశమై అభ్యంతరాలు ఉన్నవారు వారి వివరాల స్టేటస్​ను మరో జాబితాలో చూసుకోవచ్చు."

-ఎన్​ఆర్​సీ రాష్ట్ర కోఆర్డినేటర్

'ఉచిత న్యాయసహాయం'

ఎన్​ఆర్​సీ జాబితాలో పేర్లు లేని వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

భద్రత కట్టుదిట్టం...

తుది జాబితా విడుదల అనంతరం అల్లర్లు చెలరేగే అవకాశం ఉండటం కారణంగా భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేస్తోంది సర్కారు. గువహటి పోలీసు కమిషనర్ దీపక్​ కుమార్ ఎప్పటికప్పుడు భద్రతను సమీక్షిస్తున్నారు. ఎన్​ఆర్​సీ నమోదులో పాలుపంచుకున్న ప్రధాన కేంద్రం, 78 ఉపకేంద్రాల వద్ద రక్షణ సిబ్బందిని మోహరించారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర హోంశాఖ ప్రకటన విడుదల చేసింది. విద్వేషాలను రెచ్చగొట్టే సామాజిక మాధ్యమ పోస్టులపై సైబర్ నేరాల విభాగం కన్నేసి ఉంచిందని అధికార వర్గాలు అంటున్నాయి.

ఎన్​ఆర్​సీ...?

1951 అనంతరం అసోం రాష్ట్రంలో జాతీయ పౌర జాబితాను నవీకరించడం ఇదే తొలిసారి. పుట్టుకతో పౌరులైన వారిని గుర్తించి... అక్రమంగా దేశంలోకి చొరబడినవారిని దేశం వెలుపలకు పంపే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

2018 జులై 30న 40.7 లక్షలమంది... భారత పౌరులు కాదంటూ జాబితా విడుదల చేయడం వివాదస్పదమైంది. 3.29 కోట్ల దరఖాస్తులు రాగా... తుది ముసాయిదాలో 2.9 కోట్ల మంది జాబితాలో ఉన్నారు. రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది.

ఇదీ చూడండి: కాకి పగబట్టిందా? అందుకే దాడి చేస్తోందా?

Last Updated : Sep 28, 2019, 3:16 PM IST

ABOUT THE AUTHOR

...view details