ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలోని బాంబు దాడి వ్యవహారంలో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు దిల్లీ పోలీస్ ప్రత్యేక సెల్ అధికారులు. ఈ విషయంలో శనివారం సాయంత్రం వరకు పలువురి క్యాబ్ డ్రైవర్లను విచారించిన అధికారులు.. ఎటువంటి సమాచారం లభించలేదని తెలిపారు. విచారణ అనంతరం వారందరినీ పంపించివేసినట్లు వెల్లడించారు.
ముందే సమాచారం
దాడికి సంబంధించి ముందే ఇజ్రాయెల్ రాయబారి అధికారులను హెచ్చరించినట్లు ఇంటెలిజెన్స్ అధికారులు తెలిపారు. ఈ విషయమై నెల రోజుల క్రితమే ఓ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.
విమానాలు నిలిపివేత
ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత కొన్ని గంటల పాటు అంతర్జాతీయ విమానాల నిలిపివేశారు అధికారులు. టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న మూడు విమానాలను కొన్ని గంటలపాటు ఆపివేసినట్లు వెల్లడించారు. దర్యాప్తు సంస్థలతో సంప్రదింపుల తర్వాత విమానాలకు అనుమతించినట్లు తెలిపారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సీఐఎస్ఎఫ్ అన్ని విమానాశ్రయాలకు హెచ్చరిక జారీ చేసిందన్నారు.