వితంతు కోడలికి కొత్త జీవితమిచ్చిన అత్త సాధారణంగా అత్తాకోడళ్లు అనగానే ఎప్పుడూ గొడవలు, కీచులాటలు, మాటల యుద్ధాలే గుర్తుకువస్తాయి. అయితే ఒడిశా రాష్ట్రం అనుగుల్ జిల్లాకు చెందిన మాజీ సర్పంచి ప్రతిమ బెహరా ఇందుకు పూర్తిగా భిన్నం. కోడలికి అన్నీ తానై దగ్గరుండి మరో పెళ్లి జరిపించారు.
తన కుమారుడు రష్మిరంజన్కు 2019 ఫిబ్రవరిలో లిల్లీ బెహరాతో వివాహం అయింది. 5 నెలలపాటు కొత్త దంపతులు ఆనందంగా జీవించారు. జులైలో తాను పనిచేస్తోన్న గనిలో జరిగిన ప్రమాదంలో రష్మిరంజన్ మృతి చెందారు. లిల్లీ వితంతువుగా మారింది. ఆమె ఆవేదన చూసిన అత్త ప్రతిమ బెహరా చలించిపోయారు. కోడలికి కొత్త జీవితం అందించాలని భావించారు.
" నా కోడల్ని కన్న కూతురులానే చూసుకుంటాను. తను నన్ను అమ్మలానే భావిస్తోంది. బొగ్గు గనుల్లో జరిగిన ప్రమాదంలో నా కొడుకు చనిపోయాడు. నా కోడలు లిల్లీ అలా ఒంటరిగా ఉండిపోకూడదు అనిపించింది. అందుకే ఆమెకు మళ్లీ వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను." - ప్రతిమ బెహరా, లిల్లీ అత్తయ్య
తన అన్నయ్యను సంప్రందించి ఆయన కొడుకు సంగ్రామ్కి లిల్లీ బెహరాను ఇచ్చి మళ్లీ పెళ్లి చేయాలని కోరారు. సంగ్రామ్ పెళ్లికి అంగీకరించారు. కూతురు కాని కూతురైన కోడలు లిల్లీకి నచ్చజెప్పి పెళ్లికి సిద్ధం చేశారు. అనుగుల్లోని జగన్నాథుని ఆలయంలో లిల్లీ తల్లిదండ్రుల సమక్షంలో వివాహం జరిపించారు. సొంత కూతురిని అత్తారింటికి పంపినట్లుగానే కోడలిని అంతే సంప్రదాయబద్ధంగా అత్తారింటికి పంపి అమ్మగా మారారు ప్రతిమ బెహరా.