తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒడిశాలో ఫలించిన మోదీ మంత్రం - మోదీ

సార్వత్రిక ఎన్నికలకు ముందు మోదీ ఎక్కువగా పర్యటించిన రాష్ట్రాల్లో ముందువరసలో ఉంటుంది ఒడిశా. ఇక్కడ పోరు నవీన్​ పట్నాయక్​ వర్సెస్​ నరేంద్ర మోదీ అన్న రీతిలో నడిచింది. ప్రచారాలు అదే విధంగా సాగాయి. అయితే.. లోక్​సభ ఎన్నికల ఫలితాల్లో బంగాల్ తరహాలోనే.. ఇక్కడా పదింతలు మెరుగైన ఫలితాలు సాధించింది భాజపా.

ఒడిశాలో ఫలించిన మోదీ మంత్రం

By

Published : May 23, 2019, 9:34 PM IST

నవీన్​ పట్నాయక్​...ఒడిశాకు 19 ఏళ్లుగా ముఖ్యమంత్రి. 2014లో మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని.. అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో జయకేతనం ఎగురవేశారు. 21 లోక్​సభ స్థానాలకు గాను 20 నెగ్గి.. భాజపాను ఒక్క స్థానానికే పరిమితం చేయగలిగింది పట్నాయక్​ నేతృత్వంలోని బిజు జనతా దళ్​.

అయితే.. ఇది గతం. ఐదేళ్లు తిరిగాయి. ఒడిశాలో మోదీ విస్తృతంగా పర్యటించారు. ఫలితం... పది రెట్ల స్థానాల్లో భాజపా గెలుపు. నవీన్​ పట్నాయక్​ ప్రభుత్వంపై వ్యతిరేకతతో పాటూ... భాజపా అభ్యర్థుల్ని గెలిపించాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకున్నారు. మోదీని మరోసారి ప్రధానిగా చూడాలని తీర్పునిచ్చారు.

మొత్తం మోదీనే...

ఉత్తరాదిన కోల్పోయే అవకాశమున్న స్థానాలను.. ఒడిశా, బంగాల్​ రూపంలో భర్తీ చేసుకోవాలన్నది భాజపా ఆలోచన. చివరకు అనుకున్నది సాధించింది. 2019 లోక్​సభ ఎన్నికల్లో ఒడిశాలో భాజపా ఎంతో మెరుగైంది. 2014 సార్వత్రికంలో ఒక్క స్థానాన్నే గెల్చుకున్న కాషాయ పార్టీ.. ఏకంగా పదింతలు మెరుగైన ఫలితాలు సాధించగలిగింది. కారణం.. రాష్ట్రంలో మోదీ విస్తృత స్థాయి పర్యటనలు, అభివృద్ధి పథకాలు.

అసెంబ్లీ-లోక్​సభ ఎన్నికలు వేరు వేరు అని చెప్పి ఓటర్లలో అవగాహన కల్పించడంలో భాజపా శ్రేణులు విజయవంతమయ్యాయి. రాష్ట్రంలో పట్నాయక్​నే మరోసారి ముఖ్యమంత్రిగా తీర్పునిచ్చిన ఓటర్లు.. కేంద్రంలో మరోసారి మోదీనే ఉండాలనే అభిప్రాయానికి వచ్చేలా చేయగలిగారు. బీజేడీలో ఫిరాయింపులు, కాంగ్రెస్​ బలహీనపడటం.. భాజపా తమకు అనుకూలంగా మార్చుకుంది.

ఎన్నికలకు ముందు భాజపా, కాంగ్రెస్​లలో ఎవరికి మద్దతివ్వలేదు నవీన్​ పట్నాయక్​. అయితే.. మోదీ సర్కార్​ నిర్ణయాలకు మాత్రం మద్దతు తెలుపుతూ ద్వంద్వ వైఖరి అవలంబించడం ఓటర్ల దృక్పథంలో మార్పునకు కారణమైంది.

ఇదీ చూడండి:

కాషాయ ప్రభంజనం... మరోసారి మోదీకే పట్టం

ABOUT THE AUTHOR

...view details