లోక్సభ ఎన్నికల ప్రణాళికపై ముమ్మర కసరత్తు చేస్తున్న కాంగ్రెస్... నిరుపేదలకు వరాల జల్లు కురిపించింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని 20 శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా రూ.72 వేల నగదును బదిలీ చేస్తామని ప్రకటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఈ పథకం ద్వారా 5 కోట్ల కుటుంబాలకు అంటే దాదాపు 25 కోట్ల మందికి నేరుగా లబ్ధి చేకూరనుందన్నారు.
కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక కమిటీ సీడబ్ల్యూసీలో ఎన్నికల ప్రణాళికపై చర్చించిన అనంతరం ఈ ప్రకటన చేశారు రాహుల్.
పేదరికంపై అంతిమ పోరు మొదలైందని, దేశంలో పేదరికాన్ని నిర్మూలించి తీరుతామని రాహుల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ పథకం వల్ల ధనికులకు, పేదలకు సమాన గౌరవం లభిస్తుందన్నారు రాహుల్.
ఈ పథకం సాధ్యాసాధ్యాలపై, నిధులపై నిపుణులతో చర్చించి పూర్తి అవగాహనకు వచ్చాకే ప్రకటన చేస్తున్నామని పేర్కొన్నారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు "నిరుపేదలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కనీస ఆదాయ హామీ పథకాన్ని రూపొందించాం. న్యూన్తమ్ ఆయోజన్ యోజన పేరుతో దీనిని ప్రవేశపెడతాం. ఈ పథకం ఎంతోమందికి న్యాయం చేకూరుస్తుంది. భారత ప్రజలకు, పేదలకు తెలియజేస్తున్నా. నెలకు 12 వేల రూపాయలు అందిస్తాం. మేం హామీ ఇస్తున్నాం. భారత్లోని 20 శాతం నిరుపేదలకు ఏటా 72 వేల రూపాయలందిస్తాం. జాతి, కుల, మతాలకతీతంగా 20శాతం నిరుపేదలకు వారి బ్యాంకు ఖాతాల్లో నగదును బదిలీ చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రపంచంలోనే అత్యంత ధనవంతులకు ధనాన్ని ఇవ్వగలిగితే... దేశంలోని అత్యంత నిరుపేదలకు కాంగ్రెస్ ఆర్థిక సహాయన్నందిస్తుంది. నేను మాట ఇస్తున్నాను. న్యాయం చేస్తాం. ఈ పథకాన్ని దశలవారీగా అమలు చేస్తాం. ముందుగా పైలట్ ప్రాజెక్టును చేపడతాం. అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని మాట ఇస్తున్నాం. అన్ని రకాల లెక్కలు పూర్తిచేశాం. ద్రవ్యపరమైన అంశాల్నీ విశ్లేషించాం. కావాల్సిన ధనం పరిపూర్ణంగా అందుబాటులో ఉంది. ఇది తప్పనిసరిగా చేపట్టాల్సిన పథకం. మేం దీన్ని అమలు చేయబోతున్నాం." -రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు