తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెద్దల సభలో క్రమంగా పెరుగుతున్న ఎన్డీఏ బలం - ప్రాంతీయ పార్టీల మద్దతుతో దూసుకెళ్తోన్న భాజపా

పెద్దలసభలో ఎన్​డీఏ బలం పెరుగుతోంది. ప్రతిపక్ష పార్టీ సభ్యులు క్రమంగా రాజీనామాలు చేసి వెళ్లిపోతున్న తరుణంలో రాజ్యసభ మునుపటి కన్నా మోదీ ప్రభుత్వానికి అనుకూలంగా మారింది. అధికార ఎన్డీఏకు సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పటికీ స్నేహపూర్వక ప్రాంతీయ పార్టీల మద్దతుతో సౌకర్యవంతంగానే ఉంది.

పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు

By

Published : Oct 17, 2019, 5:11 AM IST

Updated : Oct 17, 2019, 11:22 AM IST

పెద్దల సభలో క్రమంగా పెరుగుతున్న ఎన్డీఏ బలం

విపక్ష పార్టీ ఎంపీల రాజీనామాల కారణంగా రాజ్యసభలో మోదీ ప్రభుత్వం మెల్లమెల్లగా బలపడుతోంది. ప్రస్తుతం ఎన్​డీఏ ప్రభుత్వానికి సంఖ్యాబలం తక్కువగానే ఉన్నా ఎన్నడూ లేనంతగా సౌకర్యంగా ఉంది. మిత్రపక్ష ప్రాంతీయ పార్టీల మద్దతుతో సురక్షిత స్థానంలో ఉంది.

మోదీ ప్రభుత్వం మొదటిసారి అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలో విపక్షాలు ఐక్యంగా ఉన్నాయి. రాజ్యసభలో ప్రభుత్వ ఎజెండాను అడ్డుకోగలిగాయి. రెండోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం పరిస్థితి మారిపోయింది. పార్టీ మార్పిడి, రాజీనామాల సహకారంతో క్రమంలో రాజ్యసభలో బలాన్ని పెంచుకుంటోంది భాజపా. ఇదే దారిలో మొదటి పార్లమెంట్ సెషన్​లో పెద్దఎత్తున బిల్లులను ఆమోదించుకుంది ఎన్​డీఏ ప్రభుత్వం.

ఎన్డీఏకు మద్దతుగా 106 మంది...

పార్లమెంటు శీతకాల సమావేశాలకు రాజకీయ పార్టీలన్నీ సన్నద్ధమవుతున్న వేళ మరో కాంగ్రెస్ ఎంపీ బుధవారం రాజీనామా చేశారు. కర్ణాటక కాంగ్రెస్ ఎంపీ కేసీ రామమూర్తి రాజీనామాతో రాజ్యసభలో హస్తం బలం 45కు పడిపోయింది. ఇక రాష్ట్రంలో మెజారిటీ కారణంగా ఈ స్థానానికి ఉపఎన్నికలు జరిగితే భాజపా ఎగరేసుకుపోయే అవకాశం ఉంది.

ఇదే జరిగితే రాజ్యసభలోని 245 సీట్లకు గాను భాజపా మెజారిటీ 83కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఎన్డీఏ కూటమి బలం 106గా ఉంది. 5 ఖాళీలు ఉన్నాయి.

ప్రాంతీయ పార్టీల మద్దతు...

ఎన్డీఏలో భాగస్వామిగా లేకున్నా అన్నాడీఎంకే ప్రభుత్వానికే మద్దతుగా నిలుస్తుంది. ఈ పార్టీలో 11 మంది ఎంపీలు ఉన్నారు. ఇలాగే బీజేడీ 7, తెరాస 6, వైకాపా 2, మరో 3 ప్రాంతీయ పార్టీల సహకారం భాజపా కీలక బిల్లులకు ఊతమిస్తోంది.

మరికొన్ని రోజుల్లో ఇతర పార్టీల నుంచి మరికొంత మంది ఎంపీలు బయటకు వెళతారని భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో మెజారిటీ కారణంగా ఆ ఉపఎన్నికల్లో భాజపాకు లాభం చేకూరే అవకాశం ఉంటుంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల నాటికి మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉందని భాజపా వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

సార్వత్రికం ప్రభంజనంతో...

లోక్​సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి వచ్చాక అనేక మంది ఎంపీలు భాజపాలోకి వచ్చారు. కాంగ్రెస్, తెదేపా, సమాజ్​వాదీ పార్టీ ఎంపీలను ఆకర్షించగలిగింది. అందువల్లే ఈసారి రాజ్యసభలో ఎలాంటి ఎదురులేకుండా పోయింది.

మొదటి దఫా మోదీ ప్రభుత్వంలో ఏకమైన విపక్షాలు బిల్లులను అడ్డుకుంటూ ఎన్డీఏకు చికాకు తెప్పించారు. కానీ రెండోసారి లోక్​సభలో భారీ మెజారిటీ కారణంగా పరిస్థితులు మారిపోయాయి. ముమ్మారు తలాక్​, అధికరణ 370 రద్దు, సమాచార హక్కు చట్టం సవరణ, జాతీయ వైద్య కమిషన్​ వంటి వివాదాస్పద బిల్లులు నెగ్గడమే ఇందుకు ఉదాహరణ.

Last Updated : Oct 17, 2019, 11:22 AM IST

ABOUT THE AUTHOR

...view details