దేశంలో లాక్డౌన్ విధించడం వల్ల కరోనా వైరస్‌ను చాలా వరకు నియంత్రించినట్లు కేంద్రం స్పష్టం చేసింది. పలు అధ్యయనాల ప్రకారం దాదాపు 14-29 లక్షల కొవిడ్ కేసులు, 37-78 వేల మరణాలను నివారించగలిగినట్లు వెల్లడించింది. లాక్డౌన్ విధించకపోయి ఉంటే కేసులు గరిష్ఠ స్థాయిలో నమోదయ్యేవని పేర్కొంది.
లాక్డౌన్ విధించడం సహా కొవిడ్‌ను ఎదుర్కోవడంలో ప్రభుత్వ సంసిద్ధతపై పలు మీడియా సంస్థల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం తాజా వివరణ ఇచ్చింది. వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి లాక్డౌన్ సమయాన్ని సమర్థంగా ఉపయోగించుకున్నట్లు వైద్య శాఖ స్పష్టం చేసింది.
సరైన సమయంలోనే
దేశంలో లాక్‌డౌన్‌పై సరైన సమయంలో, క్రియాశీలంగా నిర్ణయం తీసుకున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు, కరోనా సాధికారిక కమిటీ ఛైర్మన్ వీకే పాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు. చాలా దేశాలు లాక్డౌన్ పాటించక భారీ ప్రాణ నష్టాన్ని చవిచూశాయని పేర్కొన్నారు. లాక్డౌన్ వల్ల కరోనా మరణాల రేటులోనూ గణనీయమైన తగ్గుదల నమోదైనట్లు తెలిపారు. ఏప్రిల్ 4 నుంచి కొత్త కేసుల్లోనూ తగ్గుదల నమోదైనట్లు వెల్లడించారు.
లాక్డౌన్ ప్రారంభంలో కేసుల రెట్టింపునకు పట్టే సమయం 3.4 రోజులుగా ఉంటే ప్రస్తుతం అది 13.3 రోజులుగా ఉందని అన్నారు వీకే పాల్. కరోనా వైరస్ భారత్‌లోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైందని పేర్కొన్నారు. ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో 80 శాతం కేసులు 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని స్పష్టం చేశారు.
లాక్డౌన్ ఫలితాలు
లాక్డౌన్ వల్ల దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగినట్లు గణాంక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రవీణ్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. దేశంలో లాక్డౌన్ ప్రభావంపై వివిధ అధ్యయనాలు, నిపుణులు వెలువరించిన నమూనా-ఆధారిత గణాంకాలను వివరించారు.