భూ ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే సామర్థ్యం ఉన్న పృథ్వీ-2 క్షిపణిని డీఆర్డీఓ పర్యవేక్షణలో భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ క్షిపణిని పనితీరు పరిశీలించడానికి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం కలిగి, 350 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను చేధించే సత్తా ఉన్న పృథ్వీ-2ను బుధవారం రాత్రి 7-7:15 మధ్య ప్రయోగించినట్లు వెల్లడించారు.
'రెండు పృథ్వీ-2 క్షిపణులను వరుసగా ప్రయోగించాము. రెండు పరీక్షల్లో క్షిపణులు ప్రమాణాలకు తగినట్లు పనిచేశాయి. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. క్షిపణి వెళ్లే మార్గాన్ని రాడార్లు, ఎలెక్ట్రో ట్రాకింగ్ సిస్టమ్ల ద్వారా డీఆర్డీఓ అధికారులు పరిశీలించారు.'
-అధికారులు