ఈశాన్య దిల్లీలో సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణల్లో మృతి చెందిన వారి సంఖ్య 27కు చేరింది. గురు తేజ్ బహదూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్లో మరో ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
లైవ్: దిల్లీ అల్లర్లలో 27కు చేరిన మృతులు
21:13 February 26
20:02 February 26
దిల్లీలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. స్థానికులతో మాట్లాడి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు.
17:00 February 26
కాంగ్రెస్ 'శాంతి ర్యాలీ'
దిల్లీ అల్లర్ల నేపథ్యంలో 'శాంతి ర్యాలీ' చేపట్టారు కాంగ్రెస్ నేతలు. పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, ఇతర నేతలు.... గాంధీ స్మృతి వైపు పాదయాత్రగా వెళుతున్నారు. పోలీసులు వారిని జన్‌పథ్ రోడ్లోనే అడ్డుకున్నారు.
16:57 February 26
దిల్లీ మౌజ్‌పుర్ ప్రాంతంలో పరిస్థితిని స్వయంగా సమీక్షించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని స్పష్టంచేశారు.
16:07 February 26
దిల్లీ అల్లర్లలో మరణించిన వారి సంఖ్య 24కు చేరింది.
15:00 February 26
'1984 నాటి పరిస్థితులు పునరావృతం కానివ్వం'
దేశ రాజధానిలో జరిగిన అల్లర్లలో క్షతగాత్రులను రక్షించటంలో పోలీసుల పాత్రను ప్రశంసించింది దిల్లీ హైకోర్టు. అర్ధరాత్రి ఆదేశాలు జారీ చేసినప్పటికీ పోలీసులు తక్షణమే స్పందించి.. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారని తెలిపింది.
దిల్లీలో జరిగిన అల్లర్లపై విచారించిన జస్టిస్ ఎస్.మురళీధరన్, జస్టిస్ భాంభణి నేతృత్వంలో ధర్మాసనం... దేశంలో 1984 నాటి పరిస్థితులు పునరావృతం కానివ్వబోమని స్పష్టం చేసింది. ఘర్షణల్లో ఐబీ అధికారి మృతి దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.
బాధితులకు భరోసా కల్పించాలి..
దేశరాజధానిలో ఘర్షణల ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వాధినేతలు పర్యటించాల్సిన అవసరం ఉందని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో ఉన్నవారు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లోని ప్రజలను కలిసి, వారికి భరోసా కల్పించాలని నిర్దేశించింది దిల్లీ హైకోర్టు. చట్టం అమలు అవుతోందని వారికి అర్థమయ్యేలా చేయాలని సూచించింది.
14:49 February 26
దిల్లీ అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 22 కి చేరింది. గురు తేగ్ బహదూర్ ఆస్పత్రిలో 21 మంది, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రిలో ఒకరు చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.
14:18 February 26
సోనియాపై అధికార పక్షం ఎదురుదాడి
దిల్లీ అల్లర్లకు కేంద్రమే బాధ్యత వహించాలన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించారు కేంద్రమంత్రి, భాజపా నేత ప్రకాశ్ జావడేకర్. ఆమె అలా అనడం దురదృష్టకరమన్నారు. అల్లర్ల సమయంలో శాంతిని పునరుద్ధరించేందుకు అన్ని పార్టీలు సహకరించాలని, అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వాన్ని తప్పుబట్టడం చిల్లర రాజకీయం అవుతుందని మండిపడ్డారు ప్రకాశ్ జావడేకర్. హింసపై రాజకీయం చేయడం ఏమాత్రం తగదని హితవు పలికారు.
దిల్లీలో పరిస్థితి అదుపులోకి వస్తోందని చెప్పారు జావడేకర్. హింస చెలరేగడం వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు దర్యాప్తు జరుగుతుందని గుర్తుచేశారు. ఇలాంటి సమయంలో సోనియా చేసిన వ్యాఖ్యలు దిల్లీ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయన్నారు కేంద్ర మంత్రి.
14:02 February 26
శాంతియుతంగా ఉండాలి: మోదీ
దిల్లీ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. ఈశాన్య దిల్లీలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారన్నారు. ప్రజలు సంయమనం పాటించి.. శాంతియుతంగా ఉండాలని ట్వీట్ చేశారు.
13:57 February 26
ఐబీ ఉద్యోగి మృతి...
చాంద్‌బాగ్‌లో ఓ మృతదేహం కలకలం సృష్టించింది. మృతుడు ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి అంకిత్ శర్మగా గుర్తించారు. అల్లర్ల సమయంలో అంకిత్ ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని జీటీబీ అసుపత్రికి తరలించారు.
13:41 February 26
కాంగ్రెస్ మార్చ్ వాయిదా...
దిల్లీ అల్లర్ల నేపథ్యంలో కాంగ్రెస్ తలపెట్టిన కవాతు వాయిదా పడింది. తొలుత రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్ నిర్వహించాలనుకున్నారు. పరిస్థితిని అదుపు చేసే విధంగా చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతి పత్రం అందచేయాలని భావించారు నేతలు. కానీ రాష్ట్రపతి కోవింద్ అందుబాటులో లేకపోవడం వల్ల కవాతును వాయిదా వేసుకున్నారు.
13:23 February 26
సోనియా గాంధీ స్పందన
- దిల్లీ అల్లర్లను ఖండించిన సోనియాగాంధీ
- మూడ్రోజుల ఆందోళనలో 20 మంది చనిపోయారు: సోనియాగాంధీ
- దిల్లీలో అల్లర్ల ఘటనలు దురదృష్టకరం: సోనియాగాంధీ
- ఈశాన్య దిల్లీలో అల్లర్లకు కేంద్రం బాధ్యత వహించాలి: సోనియాగాంధీ
- బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలి: సోనియాగాంధీ
- ఇంత జరుగుతున్నా పోలీసు బలగాలను మోహరించడంలో అలసత్వం వహించారు: సోనియాగాంధీ
12:38 February 26
హోంశాఖ కీలక నిర్ణయం...
- దేశ రాజధాని దిల్లీలో పరిస్థితిని బట్టి, పారామిలిటరీ దళాల సంఖ్య పెంచాలని హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
- ప్రస్తుతం దిల్లీలో భద్రతకు 45 కంపెనీల పారామిలిటరీ బలగాలు.
- నిన్నటి వరకు పలు ప్రాంతాల్లో 37 కంపెనీల పారామిలిటరీ దళాలను మోహరించగా... బలగాలను మరింత పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
- వివిధ ప్రాంతాల్లో ఉన్న బలగాలను... పూర్తిగా శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించుకోవాలని నిర్ణయం.
- దిల్లీ పోలీసులతో సమన్వయపరుచుకుంటూ శాంతి భద్రతల పరిరక్షణకు వినియోగించుకునేలా చూడాలని హోం శాఖ నిర్ణయం.
- మొత్తం వ్యవహారాన్ని హోంశాఖ స్వయంగా పర్యవేక్షించాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన మంత్రిత్వశాఖ వర్గాలు
12:18 February 26
దిల్లీ అల్లర్లు: 20కి చేరిన మృతులు.. కేజ్రీవాల్ ఆందోళన
పౌరసత్వ చట్ట సవరణను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలో చెలరేగిన అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. మంగళవారం వరకు 13 మంది ప్రాణాలు కోల్పోగా.. కొన్ని గంటల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందటం దిల్లీలోని ఉద్రిక్త పరిస్థితులకు అద్దం పడుతోంది.
మృతుల సంఖ్యపై దిల్లీలోని గురు తేగ్ బహదూర్ ఆస్పత్రి (జీటీబీ) ఓ ప్రకటన విడుదల చేసింది. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి నుంచి నాలుగు మృతదేహాలను జీటీబీకి తరలించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు.
సైన్యాన్ని రంగంలోకి దింపాలి: కేజ్రీవాల్
ఈశాన్య దిల్లీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పోలీసులు పరిస్థితులను అదుపు చేయలేకపోయారని, సైన్యాన్ని రంగంలోకి దింపాల్సి అవసరం ఉందని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
" నిన్న రాత్రంతా దిల్లీలోని ప్రజలతో కలిసి ఉన్నా. పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. పోలీసులు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా పరిస్థితులను అదుపు చేయలేకపోయారు. చేస్తారన్న నమ్మకం లేదు. సైన్యాన్ని రంగంలోకి దింపాలి. అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో తక్షణమే కర్ఫ్యూ విధించాలి. ఈ పరిస్థితులపై కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తున్నా"
- అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి
సీడబ్ల్యూసీ సమావేశం..
దిల్లీలో చెలరేగిన హింసపై చర్చించేందుకు కాంగ్రెస్ ఉన్నత స్థాయి నిర్ణాయక కమిటీ భేటీ అయ్యింది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఆమె నివాసంలో సీనియర్ నేతలు సమావేశమయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్, ఏకే ఆంటోని హాజరయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్న కారణంగా సమావేశానికి హాజరుకాలేదు.
సీఏఏను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తూ వస్తున్న కాంగ్రెస్.. తాజా అల్లర్ల నేపథ్యంలో భవిష్యత్‌లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించింది.
కాంగ్రెస్ నేతల ర్యాలీ..
పరిస్థితులను అదుపు చేయాలని కోరుతూ.. రాష్ట్రపతి భవన్ వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు దిల్లీ కాంగ్రెస్ నాయకులు. సీడబ్ల్యూసీ సమావేశానంతరం ర్యాలీ చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.
11:42 February 26
'విచారణ జరపలేం'
దిల్లీ అల్లర్లపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. అయితే అల్లర్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టడానికి నిరాకరించింది. విచారణకు ఇది సరైన సమయం కాదని స్పష్టం చేసింది.
11:33 February 26
కేంద్ర మంత్రివర్గ సమావేశం...
- ప్రధాని నివాసంలో కేంద్రమంత్రివర్గం సమావేశం
- దిల్లీలో పరిస్థితులపై చర్చించనున్న కేంద్రమంత్రివర్గం
11:21 February 26
పౌర నిరసనల్లో 20కి చేరిన మృతుల సంఖ్య
దేశ రాజధాని హస్తినాలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనల్లో మృతి చెందిన వారి సంఖ్య 20కి చేరింది. మంగళవారం ఈ సంఖ్య 13గా ఉండగా కొన్ని గంటల వ్యవధిలోనే ఏడుగురు మృతి చెందటం ఆందోళన కలిగిస్తోంది. లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రి నుంచి 4 మృతదేహాలను జీడీబీ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు తెలిపారు.
అల్లర్లు చెలరేగిన ప్రాంతాలైన బాబుర్పురా, మౌజ్‌పుర్ సహా ఇతర ప్రాంతాల్లో పరిస్థితులు అదుపు చేసేందుకు ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నాయి భద్రతా బలగాలు.
11:12 February 26
దిల్లీ అల్లర్లపై హైకోర్టు విచారణ
దిల్లీ అల్లర్ల ఘటనపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఆందోళనలపై న్యాయ విచారణ, మృతి చెందిన వారికి పరిహారం, అరెస్టయిన రాజకీయ నాయకులకు సంబంధించిన పిటిషన్లపై విచారణ ప్రారంభించింది.
11:06 February 26
'దిల్లీలో కర్ఫ్యూ విధించాలి'
దిల్లీలో పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితులు అదుపులోకి రావట్లేదని తెలిపారు. సైన్యాన్ని రంగంలోకి దింపి.. అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో కర్ఫ్యూ విధించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు.
10:51 February 26
పౌర అల్లర్లపై దిల్లీ పోలీసులకు హైకోర్టు నోటీసులు
హింసాత్మక ఘటనలపై పోలీసులకు నోటీసులు జారీ చేసింది దిల్లీ హైకోర్టు. ఈశాన్య దిల్లీ అల్లర్ల నేపథ్యంలో దాఖలైన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మధ్యాహ్నం 12:30 గంటలకు పోలీసు ఉన్నతాధికారులు కోర్టుకు హాజరుకావాలని తెలిపింది. అల్లర్లను నియంత్రించేందుకు కోర్టు ఆదేశాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
10:25 February 26
దిల్లీ అల్లర్లపై సీడబ్ల్యూసీ సమావేశం
దిల్లీ నిరసనల్లో హింసాత్మక ఘటనలు చెలరేగుతున్న నేపథ్యంలో సీడబ్ల్యూసీ సమావేశమైంది. దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో అత్యున్నత నిర్ణాయక మండలి భేటీ అయింది. పౌరసత్వ చట్టంపై తదుపరి అనుసరించాల్సిన వ్యూహలపై సుదీర్ఘంగా చర్చించనుంది. ఈ సమావేశానికి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రియాంక గాంధీ, పి.చిదంబరం, జోతిరాదిత్య సిందియా సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు.
10:17 February 26
దిల్లీ అల్లర్ల నియంత్రణ కోసం డోభాల్‌కు బాధ్యతలు..
దిల్లీలో జరుగుతోన్న పౌరసత్వ వ్యతిరేక ఆందోళనలను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌కు బాధ్యతలు అప్పగించింది. మంగళవారం రాత్రి దిల్లీలోని జఫ్రాబాద్, సీలంపుర్ సహా పలు ప్రాంతాల్లో పర్యటించారు డోభాల్. అక్కడి పరిస్థితులపై నేటి కేబినేట్ భేటీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రులకు వివరించనున్నారు.
ఈ నేపథ్యంలో దిల్లీ హింసపై కీలక వ్యాఖ్యలు చేశారు డోభాల్. దేశ రాజధానిలో చట్ట వ్యతిరేక చర్యలను అనుమతించబోమని స్పష్టం చేశారు. అవసరమైన పోలీసులు, పారామిలటరీ బలగాలను మోహరించినట్లు తెలిపారు. పరిస్థితులను తమ అదుపులోకి తెచ్చుకునేందుకు పోలీసులకు అన్ని అధికారాలు ఇచ్చినట్లు వెల్లడించారు.
10:01 February 26
18 మంది మృతి..
ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లలో మరో ఐదుగురు మరణించారు. తీవ్ర గాయాలతో బాధపడుతూ ఈ రోజు ఉదయం మృతిచెందినట్లు గురుతేగ్ బహదుర్ ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. దీని వల్ల మృతుల సంఖ్య 18కి చేరింది.
ఈశాన్య దిల్లీలో పౌరసత్వ చట్టంపై జరిగిన ఆందోళనల్లో భారీ హింస చెలరేగింది. సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల మధ్య ఘర్షణలతో దిల్లీ వీధుల్లో విధ్వంసం జరిగింది. 18మంది మరణించగా.. 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.