వినాయక చవితి అంటే అందరికీ పండుగే. కానీ, కొందరికి మాత్రం అదే జీవనాధారం. గణేశ్ విగ్రహాలకు మనం పూజలు చేస్తాం.. కానీ, కొందరు ఆ విగ్రహాలకు తమ శ్రమతో జీవం పోస్తారు. ఆ కళాకారులకు ఈ కరోనా కాలంలో ఆదరణ కొరవడింది. మరి, వారి కడుపు నిండేదెలా? ఏడాదంతా వారు బతికేదెలా? కర్ణాటకకు చెందిన ఓ కళాకారుడు తమ ఆవేదనను ప్రపంచానికి తెలియజేశాడు. మన దేశంలో పుట్టి విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐల మనసు కరిగించాడు.
కర్ణాటక ప్రభుత్వం గణేశ్ ఉత్సవాలకు అనుమతులు నిరాకరించింది. దీంతో గణేశ్ విగ్రహాలు తయారు చేసి, జీవనం సాగించే కళాకారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ధార్వాడ్ జిల్లాకు చెందిన కళాకారుడు మంజునాథ్ తన కష్టాలను వివరిస్తూ ఓ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. నెటిజన్లను కంటతడి పెట్టించిన ఆ వీడియో ఎల్లలు దాటి వైరల్ అయింది. అది చూసిన కొందరు ఎన్ఆర్ఐలు తమదైన శైలిలో స్పందించి మానవత్వాన్ని చాటున్నారు.