కెనడాలోని ఎడ్మంటన్ నగరం.... మార్చి 31 ఉదయం 8 గంటలు.
ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నా మాకీయెంకో, ఆమె భర్త, కుమార్తెతో కలిసి వచ్చి ఓటు వేసింది.
ఇక్కడొక ప్రత్యేకత ఉంది. అన్నా కుటుంబం స్వదేశం ఉక్రెయిన్. ఇక్కడ జరుగుతోంది ఉక్రెయిన్ అధ్యక్ష ఎన్నికల పోలింగ్.
కట్ చేస్తే...
సీన్-2:
అమెరికాలోని న్యూజెర్సీ నగరం.... ఏప్రిల్ 6 ఉదయం 7 గంటలు.
ఆంధ్రప్రదేశ్ పయనం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు ప్రవాస భారతీయ వైద్యుడు గౌతమ్. ఆయన రాకకు కారణం... ఏప్రిల్ 11న జరిగే లోక్సభ, శాసనసభ ఎన్నికలు.
ఎందుకిలా...?
'ఉక్రెయిన్' తూర్పు ఐరోపాలోని ఓ చిన్న దేశం. దేశ జనాభా 4.2 కోట్లు. మార్చి 31 అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. విదేశాల్లో ఉండే ఉక్రెనియన్లకు ఓటు హక్కు కల్పించింది ఆ దేశం. అది కూడా వారున్న చోటే. 72 దేశాల్లో ఉన్న ఉక్రెయిన్ దౌత్య కార్యాలయాల్లో 101 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. అందుకే... కెనడాలో ఉండే అన్నా లాంటి వారు ఓటు వేయగలిగారు. స్వదేశాధినేతను ఎన్నుకోవడంలో తమ వంతు పాత్ర పోషించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ విషయంలో మాత్రం అలా కుదరదు. ప్రవాస భారతీయులు ఎవరైనా సరే ఓటేయాలంటే ఇక్కడకు రావాల్సిందే. ఇదెంతో కష్టమైన పని. ఖర్చుతో కూడుకున్నది.
భారత్లో ప్రస్తుతం ఇలా...
విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతర కారణాలతో విదేశాల్లో ఉంటున్న భారతీయుల సంఖ్య మూడు కోట్ల 10 లక్షలు. వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం స్పష్టమైన నిబంధనలు జారీ చేసింది. ఈసీ వెబ్సైట్లోని ఫామ్-6ఏ ద్వారా ప్రవాస భారతీయులు తగు ఆధారాలతో దరఖాస్తు చేసుకొని ఓటు హక్కు పొందొచ్చు. ఎన్నికల సమయంలో మాత్రం ఇక్కడికి వచ్చి నిర్దేశిత ప్రాంతాల్లో ఓటు వేయాలి.
ఇందుకోసం 2010లో యూపీఏ ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించింది. అప్పుడు ప్రవాస భారతీయుల సంఖ్య 1.3 కోట్లు. వారిలో ఓటర్లుగా నమోదు చేసుకున్నవారు 71వేల మంది మాత్రమే.