తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పార్టీలు, ఫొటోషూట్లు.. అన్నీ 'డబుల్ డెక్కర్' బస్సులోనే! - కేరళ డబుల్ డెక్కర్ ఫొటోషూట్లు

లండన్​లో కనిపించే డబుల్ డెక్కర్ తరహా బస్సుల్లో పార్టీలు చేసుకోవాలని ఉందా? ఇలాంటి బస్సుల్లో ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్లు నిర్వహించుకోవాలని ఉందా? మరెందుకు ఆలస్యం మన దగ్గరా ఇలాంటి డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చేశాయి. ఎక్కడ? ఎలా? ధరెంత అనేవి తెలుసుకోవాలని ఉందా? పూర్తి కథనాన్ని చదివేయండి.

Now you can hire a KSRTC double decker bus for photoshoots and birthday parties
సేవ్​ ద డేట్​ ఫొటోషూట్​కు డబుల్​డెక్కర్​ బస్సులు!

By

Published : Nov 14, 2020, 10:06 AM IST

'సేవ్​ ద డేట్'​ ఫొటోషూట్​కు డబుల్​డెక్కర్​ బస్సులు!

పుట్టినరోజు వేడుకలు, ఫంక్షన్లు, వివాహాది శుభకార్యాలు... సందర్భమేదైనా ఫొటోషూట్లు లేకుంటే చాలా కష్టం. ఇక ప్రస్తుత డిజిటల్ యుగంలో పెళ్లి కార్డులకు బదులు చిన్నపాటి వీడియోలనే శుభలేఖలుగా పంపించుకుంటున్నారు. దీనికోసం కొత్తగా వీడియో షూట్లు, ఫొటో షూట్లు నిర్వహించుకుంటున్నారు. కానీ ఎప్పుడూ వాటర్ ఫాల్స్, బీచుల్లోనే కాకుండా.. క్లాసిక్​గా పాతకాలపు డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫొటోలు దిగితే ఎలా ఉంటుంది?

ఐడియా బానే ఉంది కానీ, డబుల్ డెక్కర్ బస్సులెక్కడివి అంటారా? ఈ అవకాశాన్నే కేరళ ఆర్టీసీ అందిస్తోంది. ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ల కోసం డబుల్ డెక్కర్ బస్సులను అద్దెకు ఇస్తోంది. రోడ్డుపై ప్రయాణిస్తూ కూడా డబుల్ డెక్కర్ బస్సుల్లో ఫొటోషూట్ నిర్వహించుకోవచ్చు. ప్రస్తుతం ఈ వెసులుబాటు తిరువనంతపురం వరకే అందుబాటులో ఉంది.

బర్త్​డే పార్టీలకూ

ఫొటోషూట్లే కాదు, చిన్నపాటి పుట్టినరోజు వేడుకలు కూడా ఈ బస్సుల్లో చేసుకోవచ్చు. లండన్​లో కనిపించే 'ఆఫ్టర్​నూన్ టీ బస్' తరహాలో ఈ బస్సులను డిజైన్ చేశారు. అంటే కింది భాగంలో సీట్లు ఉండి పై భాగంలో పార్టీలు చేసుకొనేందుకు ఖాళీ ప్రదేశం ఉంటుంది.

ధర చెప్పనేలేదు కదా...!

ఫొటోషూట్లు, పుట్టినరోజు వేడుకలు ఇలా దేనికోసమైనా చాలా తక్కువ ధరకే బస్సును అద్దెకు తీసుకోవచ్చు. ఎనిమిది గంటలకు గానూ 4 వేల రూపాయలను కేరళ ఆర్టీసీ ఛార్జి చేస్తోంది. అయితే తిరువనంతపురం నుంచి 50 కి.మీల పరిధిలోనే ఈ బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది.

రెండు ప్రయోజనాలు

అదనపు రెవెన్యూ కోసం కేరళ ఆర్టీసీ ఈ ఆలోచనకు కార్యరూపం ఇచ్చింది. యువతకు కొత్తదనం, ఆర్టీసీకి ఆదాయం.. ఇలా ఈ ఐడియా రెండు రకాలుగా ఉపయోగపడుతోంది. ఫొటోషూట్ల కోసం డబుల్ డెక్కర్ బస్సులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కోజికోడ్, కొచ్చి నగరాల్లోనూ ఇలాంటి వెసులుబాటు కల్పించాలని ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది.

నిజానికి ఈ మధ్య ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్లకు గిరాకీ బాగా పెరిగింది. అతిథుల రాక కోసం పంపించే 'సేవ్​ ది డేట్' వీడియోలకు విశేష ఆదరణ లభిస్తోంది. అంతర్జాలంలో కనిపించే ఇలాంటి వీడియోలన్నీ దాదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో, నీటి కొలనుల వద్ద తీసుకున్నవే. కేరళ ఆర్టీసీ అందిస్తున్న ఈ వెసులుబాటుతో నగరంలోనూ కొత్తగా ఫొటోషూట్ చేసుకోవచ్చు. డబుల్ డెక్కర్ బస్సులో నిర్వహించిన తొలి ఫొటోషూట్​కు అంతర్జాలంలో బాగా ప్రాచుర్యం లభించింది.

ఇదీ చూడండి:అవగాహన, జీవనోపాధి కల్పించే 'ప్యాడ్ ఉమెన్'

ABOUT THE AUTHOR

...view details