తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యవసాయాన్ని పండగ చేద్దాం

అది చెమట వాసన కాదు.. మట్టి సువాసన.. ఆ భూగంధం నేడు పురుగుమందులు సోకి పరిమళాన్ని కోల్పోతోంది. వారిది చేతకానితనం కాదు.. అన్నంపెట్టే ‘అమ్మ’తనం. ఆ దాతృత్వం నేడు అప్పుల కోసం అంగలారుస్తోంది. వారేం గిట్టని వారు కాదు.. పుట్ల కొద్దీ పండించి దేశానికి బువ్వ పెడుతున్న కృషీవలులు. ఆ సహాయ గుణం నేడు గిట్టుబాటు ధరలేక అసహాయిగా మిగిలింది.

By

Published : Dec 30, 2019, 7:44 AM IST

Now we do Agricultural in India
వ్యవసాయాన్ని పండగ చేద్దాం

అన్నదాత దశాబ్దాలుగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాడు. సాగు ఖర్చులు బరువై.. పెట్టుబడి సౌకర్యాలు కరవై.. ఆదుకునేవారు మృగ్యమై.. విపత్తులతో వికలమై భారంగా బతుకీడుస్తున్నాడు. ఆ మోములో మళ్లీ నవ్వులు పూయించడం ఓ పెద్ద సవాలు. చొచ్చుకొస్తున్న సాంకేతికతను అతనికి మరింత చేరువచేయడం, నిల్వ సౌకర్యాలు, తగిన గిట్టుబాటు ధరలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత. వ్యవసాయాన్ని పండగలా మార్చడానికి కొత్త దశాబ్దిలో ఏమేం చేయాలి? అన్నదాతలకు అండగా ఎలా నిలవాలి? యువతరం పొలాల్ని అమ్మేలా కాదు.. నమ్మేలా ఎలా తీర్చిదిద్దాలి?

రోజులు మారుతున్నాయి. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు చొచ్చుకొస్తున్నాయి. గోవు ఆధారిత, ప్రకృతి సాగు విధానాలూ అమలవుతున్నాయి. ఎన్ని మార్పులొచ్చినా.. మన దేశంలో రైతు బతుకు మారట్లేదు. అతని కష్టానికి విలువ లేకుండాపోతోంది. ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను తట్టుకోలేక.. రుణాల ఊబిలో చిక్కి శల్యమవుతున్నాడు.

దేశంలో 1995 నుంచి 3 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 2014లో 60 వేల మంది రైతులు అప్పుల బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ పరిస్థితి మారాలంటే, కొత్త దశాబ్దిలో అప్పుల నుంచి అభ్యుదయం వైపు అన్నదాత అడుగులు వేయాలంటే ఏం చేయాలి?ప్రభుత్వాల కర్తవ్యం ఏమిటి? కొత్త దశాబ్దిలో వ్యవసాయాన్ని పండగలా చేయడం ఎలా?

దేశంలో అన్నదాతకు సవాళ్లివీ..

మద్దతు ధరలు

ఆరుగాలం శ్రమించిన రైతన్నకు తగిన గిట్టుబాటు ధరలు రావడం లేదు. మార్కెట్‌ మాయాజాలానికి బలైపోతున్నాడు. పెట్టిన పెట్టుబడులూ తిరిగి రావడం లేదు. పైపెచ్చు గత 10-15 ఏళ్లలో కౌలు, కూలి, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిస్థితులు వ్యవసాయాన్ని జూదంగా మార్చేశాయి. అందుకే రెండు మూడు దశాబ్దాలుగా రైతు కుటుంబాలు తమ పిల్లలు వ్యవసాయంలో స్థిరపడడానికి ఇష్టపడడం లేదు.

పెరగని ఆదాయం

దేశంలో ఇప్పటికీ 50 శాతానికి పైగా కుటుంబాలకు వ్యవసాయమే జీవనాధారం. ఆర్థిక సర్వే ప్రకారం 17 రాష్ట్రాల్లో సగటున వ్యవసాయ కుటుంబ వార్షిక ఆదాయం రూ.20 వేలు మాత్రమే.

అతివృష్టి, అనావృష్టి

దేశంలో ఏటా మూడో వంతు సాగు భూముల్లో విపత్తులు, అతివృష్టి, అనావృష్టితో పంట నష్టపోవడం సర్వసాధారణంగా మారింది. ఆయా రైతులకు అండగా ఉండడానికి బీమా, కరవు ప్రకటన నిబంధనల్ని సవరించాల్సి ఉంది.

బహుళజాతి పడగ

బహుళజాతి కంపెనీలు చేతులు కలిపి వ్యవసాయ ఉత్పత్తుల ధరలను నిర్దేశిస్తున్నాయి. రైతులపై వీటి పెత్తనం వచ్చే పదేళ్లలో ఇంకా అధికమయ్యే అవకాశం ఉంది. దీనిపై దృష్టి సారించాల్సి ఉంది.

భవంతులు వెలుస్తున్నాయ్‌

దేశ జనాభా ఏటా సగటున కోటిన్నర అదనంగా పెరుగుతోంది. వీరందరికీ అవసరమైన నివాసాలు, వ్యాపారాలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాల్ని ఏర్పాటు చేయడానికి సారవంతమైన భూముల్ని వినియోగిస్తున్నారు. దీంతో ఆ భూములు సాగుకు దూరమై.. ఆహార భద్రతకు ముప్పు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది.

రసాయన ఎరువుల అధిక వినియోగం

దేశవ్యాప్తంగా రసాయన ఎరువులను అవసరానికి మించి వినియోగిస్తున్నారు. ఇందుకోసం రైతు అధికంగా డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి. ఇలా అతి వాడకం వల్ల భూసారమూ క్షీణిస్తోంది.

దూరమవుతున్న యువత

పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ 2017-18 సర్వే ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో 3.4 కోట్ల మంది దినసరి కూలీలు 2011-18 మధ్య ఉపాధి కోల్పోయారు. వీరిలో 3 కోట్ల మంది వ్యవసాయ కూలీలే. రైతు కుటుంబాల పిల్లలు, కూలీల కుటుంబాల్లో పిల్లలు ఉద్యోగాలు, ఇతర ఉపాధులు వెతుక్కుంటున్నారు. దీంతో వ్యవసాయంలో యువత భాగస్వామ్యం క్రమేపీ తగ్గుతోంది.

సాగు బాగుకు ఏం చేయాలి?

  • చిరుధాన్యాలు.. సేంద్రియ వ్యవసాయం.. ఆహార శుద్ధి.. సేంద్రియ ఆహార ఉత్పత్తులకు ఆదరణ పెరుగుతోంది. దీనిని రైతులు అందిపుచ్చుకునేలా ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాలి. రైతే ఆహారశుద్ధిపై దృష్టిసారించాల్సి ఉంది. బహుళ, అంతర్గత పంటల సాగును ప్రోత్సహించాలి.
  • వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి. అధిక దిగుబడినిచ్చే, తెగుళ్లను తట్టుకునే వంగడాలపై పరిశోధనలు అత్యవసరం.
  • డిజిటల్‌ సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, అధునాతన పరీక్ష పద్ధతుల్ని రైతులకు మరింత చేరువ చేయాలి.
  • పలు పంటల సాగు విస్తీర్ణం పరంగా భారత్‌ ప్రపంచంలో రెండు, మూడు స్థానాల్లో ఉన్నా... ఉత్పాదకతలో చాలా వెనకబడి ఉంది. వరి పంటకు సంబంధించి ఎకరాకు సరాసరిన 20 క్వింటాళ్ల దిగుబడి సాధించాలని నీతిఆయోగ్‌ లక్ష్యంగా ప్రకటించింది. ప్రస్తుతం ఎకరాకు సగటున 10 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే సాధిస్తున్నాం. నకిలీ విత్తనాలు, వర్షాభావం, తెగుళ్లు.. ఇలా అనేక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. సాగునీటి వసతి పెంచడం, భూసార సంరక్షణ చర్యలతో కొంతవరకు ఈ సమస్యను అధిగమించొచ్చు.
  • వ్యవసాయ పనులకు కూలీల కొరత తీవ్రంగా ఉంటోంది. యంత్రాలకు రాయితీలిస్తున్నామని బడ్జెట్లలో నిధులు చూపుతున్నా విడుదల చేయడం లేదు. వచ్చే పదేళ్లలో రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయ యంత్రాలకు డిమాండ్‌ ఉంటుందని అంచనా.
  • రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే వ్యవసాయం పండగవుతుందనడంలో సందేహం లేదు. మద్దతు ధరలు ప్రకటిస్తున్నా.. వాటిపై పర్యవేక్షణ లేదు. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ పటిష్ఠంగా లేదు. మార్కెటింగ్‌ వ్యవస్థను నవీకరించాలి. మూడేళ్ల క్రితం ప్రారంభించిన ‘ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌’(ఈ-నామ్‌) వ్యవస్థ ఇప్పటికీ గాడిలో పడలేదు. వ్యవసాయ మార్కెట్లలో అధునాతన సదుపాయాల కల్పనకు నిధుల కొరత తీవ్రంగా ఉంది.
  • కౌలు రైతులకు రాయితీలు, ఇతర సాయం చేసే వ్యవస్థలు ఏర్పాటైతేనే సేద్యానికి అండ.

దిగుబడులు పెరిగితేనే..

గతేడాది దేశంలో 28.49 కోట్ల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడి వచ్చింది. 2030 నాటికి పెరిగే దేశ జనాభాకు ఆహార భద్రత సమకూర్చాలంటే ఆహార ధాన్యాల దిగుబడి 35.50 కోట్ల టన్నులకు పెరగాలి. గత పాతికేళ్లలో బియ్యం లభ్యతలో రోజువారీగా 18 గ్రాముల తగ్గుదల నమోదైంది. ఆహార భద్రతలో 113 దేశాల్లో భారత్‌ది 76వ స్థానం. వచ్చే పదేళ్లలో పంటల దిగుబడిని ఇప్పటికన్నా కనీసం 20 శాతం పెంచితేనే ఆహార భద్రత సాధ్యం.

కౌలు రైతులకు రక్షణేది?

ప్రభుత్వం ఇచ్చే రాయితీలు, పంట రుణాలన్నీ భూముల యజమానులకే దక్కుతున్నాయి. కౌలు రైతులకు ప్రైవేటు అప్పులే శరణ్యమై అధిక వడ్డీలతో నష్టపోతున్నారు.

ఇదీ చూడండి: సాగును ప్రేమించాడు.. కొలువును త్యజించాడు.. నగధీరుడయ్యాడు!

ABOUT THE AUTHOR

...view details