కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలందిస్తున్నారు వైద్య సిబ్బంది. కుటుంబాలను వదిలి కంటికి కనిపించని శత్రువుతో నిత్యం పోరాటం చేస్తున్నారు. వీరికి అండగా కేరళ ఆరోగ్యశాఖ సహకారంతో ఓ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు రూపొందించిన రోబో సేవలను వినియోగిస్తున్నారు. ఐసోలేషన్ వార్డులో ఉన్న రోగులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేసేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు.
కేరళలో సేవలు..
చైనాలోనే కాదు కేరళలోనూ కరోనా సోకిన వారికి వైద్య సేవలు అందిస్తోంది ఓ రోబో. నైటింగేల్-19 అనే ఈ రోబో కన్నూర్ జిల్లా అంకరకాండిలోని కరోనా బాధితులకు ఆహారం, మందులు సరఫరా చేస్తుంది. అంతేకాకుండా బాధితులను ఆరోగ్య కార్యకర్తలతో పాటు అవసరమైతే వారి బంధువులతో మాట్లాడేందుకు నైటింగేల్-19 ఎంతో సహకరిస్తుంది.