తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వూలా ఛాయ్​... జర దేఖో భాయ్​! - assam tea

అసోంకు చెందిన యువకులు తేనీటిలో కొత్త రకాన్ని రూపొందించారు. 'వూలా ఛాయ్​'గా పిలిచే ఈ తేనీటి రుచిని మరింత మందికి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

whoola chai, assam
వూలా ఛాయ్​... జర దేఖో భాయ్​!

By

Published : Jan 9, 2021, 7:05 PM IST

వూలా ఛాయ్​తో ఉల్లాసం

టీ.. ఎంతో మంది భారతీయుల జీవితాల్లో ఒక భాగం. ఎంతగా అంటే రోజుకు ఒకసారైనా తేనీటి చుక్కతో గొంతు తడవకపోతే గడవనంతగా. ఆ టీలో మళ్లీ ఎన్నో రకాలు.. అల్లం, లెమన్, గ్రీన్, ఇలాచీ, ఇరానీ ఇలా చెప్పుకుంటూ పోతే జాబితా చాంతాండంత ఉంటుంది.

ఇప్పుడు ఈ జాబితాలోకి అసోంకు చెందిన ఇద్దరు యువకులు ఓ కొత్త రకం టీని చేర్చారు. అదే 'వూలా ఛాయ్'. ఉపమన్యు బోర్కాకోటి, అంగ్షుమాన్ భరాలీ అనే ఇద్దరు మిత్రులు ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

సిసలైన ఉల్లాసానికి..

అస్సామీలో వూలా అంటే ఉల్లాసం అని అర్థం. ఈ కొత్త రకం తేనీరు మనసుకు ఉల్లాసాన్ని అందించడమే కాక అసలు సిసలైన టీను తాగిన అనుభవం అందిస్తుందని ఈ మిత్ర ద్వయం అంటోంది. 2015లో 'ది టీ లీఫ్ థియరీ' పేరుతో ప్రయోగశాల ప్రారంభించి, వూలా టీలో ఇటీవల నాలుగు రకాలను ప్రవేశపెట్టారు. ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం వైట్​ టీ, గ్రీన్​ టీ, డర్టీ డిటోక్స్​, కిల్లర్ ఇమ్మెనిటీ అనే నాలుగు రకాల ఉత్పత్తులపై అమ్మకాలు జరుపుతున్నాము."

-ఉపమన్యు బోర్కాకోటి

"ప్రస్తుతం ఈ ఉత్పత్తి విక్రయాలను ఆన్​లైన్​ ద్వారానే చేపడుతున్నాము. కానీ ఫిబ్రవరి నుంచి అసోం సహా మిగతా ప్రాంతాల్లోకి విస్తరించాలనుకుంటున్నాము. మార్చి- ఏప్రిల్​ మధ్య ఎగుమతులను కూడా ప్రారంభిస్తామని ఆశిస్తున్నాను."

-అన్గషుమాన్ భరాలీ

ఏంటి ప్రత్యేకత?

వూలా టీ కోసం రెండు తాజా తేయాకులు, మొగ్గను దగ్గరకు కుదించి ఒక్కచోట కడతారు. టీ ఆకులు విరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. టీ బ్యాగ్​ తరహాలో దీన్ని నేరుగా వేడి నీటిలో ముంచితే వూలా ఛాయ్ తయారవుతుంది. విశేషం ఏంటంటే వేడి నీటిలో ముంచిన కాసేపటికి.. కుదించి ఉంచిన తేయాకులు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటాయి. ఈ టీ రకంపై పేటెంట్ హక్కుల కోసం వీరు దరఖాస్తు చేసుకున్నారు. రెండు తేయాకులను, ఓ మొగ్గను ఇలా కట్టి ఉంచడం ద్వారా ఫ్లేవర్​ను ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చని చెబుతున్నారు.

వూలా ఛాయ్

డార్జీలింగ్, అరుణాచల్ ప్రదేశ్​లో పండిన తేయాకులపై పరిశోధనలు చేసిన ఈ స్నేహితులు చివరకు అసోంలో స్థానికంగా పండిన తేయాకునే ఎన్నుకున్నారు. కేవలం రెండు తేయాకులు, మొగ్గతో అమోఘమైన టీని తేనీటి ప్రేమికులు ఆస్వాదించొచ్చని చెబుతున్నారు.

ఇదీ చూడండి :గులాబీ టీ తాగేద్దామా..

ABOUT THE AUTHOR

...view details