అసెంబ్లీ సమావేశాలకు తేదీ దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్‌లో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. నిన్నటి వరకు తిరుగుబాటు నేత సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు ఓ చోట... సీఎం అశోక్ గహ్లోత్ వర్గం ఎమ్మెల్యేలు మరో చోట రిసార్టుల్లో తలదాచుకున్నారు. ఇప్పుడు భాజపా వంతు వచ్చింది. అశోక్ గహ్లోత్ ఒత్తిళ్ల నుంచి తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వారిని గుజరాత్ తరలిస్తోంది.
ఈ నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భాజపాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు శనివారం జైపుర్ విమానాశ్రయం నుంచి ఛార్టెడ్ విమానంలో గుజరాత్‌లోని పోర్‌బందర్‌కు తరలివెళ్లారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు తరలి వెళ్లినట్లు సమాచారం. సుమారు 40 మంది ఎమ్మెల్యేలను ఈ విధంగా ఆ పార్టీ తరలించనున్నట్లు తెలుస్తోంది.