కరోనా పరీక్షలు విస్తృతంగా నిర్వహించే విధంగా కిట్ల తయారీకి భారత శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సత్వరమే కరోనా పరీక్షలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు కేరళలోని రాజీవ్ గాంధీ జీవసాంకేతిక సంస్థ శాస్త్రవేత్తలు. తక్కువ ఖర్చుతో, సులభంగా పరీక్షలు నిర్వహించేలా కరోనా యాంటీబాడీ టెస్టింగ్ కిట్ (ఆర్జీఐబీ)ను రూపొందించారు.
ప్రస్తుతం పరీక్ష విధానంలోని పరిమితులన్నీ ఈ ఆర్జీసీబీ కిట్ల ద్వారా అధిగమించవచ్చు. నిపుణులు అవసరం లేకుండానే ఈ పరీక్షలు నిర్వహించవచ్చని అధికారులు చెబుతున్నారు. కొద్దిపాటి శిక్షణతో ఆశావర్కర్లు, వాలంటీర్ల ద్వారా కూడా ఈ పరీక్షలు చేయించవచ్చని స్పష్టం చేశారు. కేవలం 20 నిమిషాల్లోపే ఈ పరీక్ష ఫలితాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. భారత్‌లో ఒకవేళ కమ్యూనిటీ వ్యాప్తి సంభవిస్తే ఇలాంటి కిట్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఎన్నో ప్రత్యేకతలు
- ఈ టెస్టింగ్ కిట్‌కు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నమూనా ఫలితాలను ఈ కిట్ కేవలం 5 నిమిషాల్లోనే రాబడుతుంది. 15 నిమిషాలలో పూర్తి సమాచారం వెల్లడిస్తుంది.
- దీని తయారీకి రూ.400 ఖర్చు అయినట్లు తెలుస్తోంది. కాగా దీని వెల గరిష్ఠంగా రూ.600కి మించకుండా ఉండే విధంగా మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.
- ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉండటం వల్ల ప్రజలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించవచ్చు.
- ఈ కిట్ ద్వారా నిపుణుల అవసరం లేకుండానే పరీక్షలు నిర్వహించవచ్చు.
- సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద వీటిని నిల్వ చేయవచ్చు. దీని కాలపరిమితి ఒక సంవత్సరం.