తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో నేడు విపక్షాల నేతల కీలక సమావేశం

ఎగ్జిట్​పోల్స్​ అంచనాలు, రెండు రోజుల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, భాజపాయేతర పార్టీలతో ప్రభుత్వ ఏర్పాటు, ఈసీ అనుసరిస్తున్న వైఖరి అంశాలపై నేడు దిల్లీలో విపక్షాల నేతలు భేటీ కానున్నారు. అనంతరం ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై మరోసారి డిమాండ్లను విన్నవించనున్నారు.

ప్రతిపక్షాల భేటీ

By

Published : May 21, 2019, 6:45 AM IST

Updated : May 21, 2019, 7:16 AM IST

దిల్లీ వేదికగా నేడు విపక్షాల ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఎగ్జిట్​పోల్స్​ అంచనాలు, దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భాజపాయేతర పక్షాలతో ప్రభుత్వ ఏర్పాటు, ఎన్నికల సంఘం అనుసరిస్తున్న వైఖరి తదితర అంశాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్​, తెలుగుదేశం, వామపక్షాలు, తృణమూల్​ కాంగ్రెస్​, బీఎస్పీ, ఎన్​సీపీ సహా మరిన్ని పార్టీల ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1.30 గంటలకు దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో ఈ భేటీ జరగనుంది.

తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్​ నుంచి సీనియర్​ నేతలు అహ్మద్​ పటేల్​, గులాం నబీ అజాద్​, ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​, సీపీఎం సీనియర్​ నేత సీతారాం ఏచూరి, సీపీఐ తరఫున డి.రాజా, తృణమూల్​ నేత డెరెక్​ ఓబ్రెయిన్​, బీఎస్పీ తరఫున సతీశ్​ చంద్ర మిశ్రా సహా మరికొందరు నేతలు సమావేశానికి హాజరవుతారని సమాచారం.

ఐక్యత కోసం తెదేపా అధినేత భేటీలు

విపక్షాల ఐక్యత కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. బంగాల్​ సీఎం మమతా బెనర్జీతో సోమవారం భేటీ అయ్యారు. హంగ్​ ఏర్పడితే భాజపాయేతర పక్షాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపై సమాలోచనలు జరిపారు. కాంగ్రెస్​ సహా మిగిలిన ప్రాంతీయ పార్టీల మద్దతుతో కేంద్రంలో అధికారాన్ని చేపట్టే విషయంలో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. యూపీఏ చైర్​పర్సన్​ సోనియా గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీతో ఆదివారమే ఆయన భేటీ అయ్యారు. గతకొంత కాలంగా విపక్షాల నేతలందరినీ ఆయన కలుస్తున్నారు. నేడు మరోసారి దిల్లీలో విపక్షాల నేతలందరూ భేటీ కానున్నారు.

ఈసీని కలవనున్న నేతలు

భేటీ అనంతరం విపక్షాల నేతలు అందరూ కలిసి మధ్యాహ్నం 3గంటలకు ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. ఈవీఎం లెక్కలను వీవీ ప్యాట్​ స్లిప్పులతో సరిపోల్చే అంశంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని సూచించనున్నారు.

ఈవీఎం, వీవీ ప్యాట్ స్లిప్పుల మధ్య ఒక్క పోలింగ్​ కేంద్రంలో వ్యత్యాసం వచ్చినా, ఆ అసెంబ్లీ పరిధిలోని అన్ని వీవీ ప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని నేతలు ఈసీని డిమాండ్​ చేస్తున్నారు.

ప్రతి అసెంబ్లీ పరిధిలోని ఐదు పోలింగ్​ కేంద్రాల్లో వీవీ ప్యాట్ స్లిప్పులను తప్పనిసరిగా లెక్కించాలని గతంలో ఈసీకి సూచించింది సుప్రీంకోర్టు. దీనివల్ల ఈసారి ఫలితాలు కాస్త ఆలస్యంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఇదీ చూడండి : ఎగ్జిట్​ పోల్స్​: గంభీర వదనంతో కాంగ్రెస్​ శ్రేణులు

Last Updated : May 21, 2019, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details