గంగూలీ, కోహ్లీ, తమన్నాలకు నోటీసులు - బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ
15:27 November 03
ఆన్‌లైన్ జూదం నిషేధం కేసులో ప్రముఖులకు నోటీసులు
ఆన్‌లైన్ జూదం నిషేధం కేసుపై తమిళనాడులోని మదురై బెంచ్ విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా క్రీడా, సినీ ప్రముఖులకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ జూదం సంస్థలకు ప్రచారకర్తలుగా ఉన్నారంటూ బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, సినీ ప్రముఖులు ప్రకాశ్‌రాజ్, తమన్నా, రానా, సుదీప్‌లకు మదురై బెంచ్ నోటీసులు ఇచ్చింది.
ఆన్‌లైన్ రమ్మీలో డబ్బు కోల్పోయి అనేకమంది ఆత్మహత్య చేసుకుంటున్నారని పిల్ దాఖలైంది. దీనిని నిషేధించాలని పిటిషన్‌దారు కోరగా.. విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వానికి కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఆన్‌లైన్ జూదం డబ్బు ఎక్కడికి పోతోందని అడిగింది.
తెలంగాణలో ఇప్పటికే ఆన్‌లైన్ జూదం నిషేధించారని ప్రస్తావించింది ధర్మాసనం. జూదం నిషేధానికి 10 రోజుల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.