తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

రామ్​ జెఠ్మలానీ... దేశంలోనే దిగ్గజ న్యాయవాది. అత్యధిక పారితోషికం తీసుకునే లాయర్​గా గుర్తింపు పొందిన వ్యక్తి. అతి పిన్న వయసులోనే న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్న ఆయన... కీలక కేసుల్లో అప్రతిహత విజయాలతో దూసుకెళ్లారు. రాజకీయంగా ఎన్నో కీలక పదవులు చేపట్టినా... న్యాయవాదిగానే అందరికీ సుపరిచితం అయ్యారు.

రామ్​ జఠ్మలానీ

By

Published : Sep 8, 2019, 10:32 AM IST

Updated : Sep 29, 2019, 8:49 PM IST

రామ్​ జెఠ్మలానీ

ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్​ జెఠ్మలానీ(1923 సెప్టెంబర్​14- 2019 సెప్టెంబర్​ 8) ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దిల్లీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

17 ఏళ్లకే 'లా' పట్టా

పాకిస్థాన్​లోని సింధ్​ డివిజన్​ శికర్​పుర్​ గ్రామంలో బూల్చంద్​ గుర్ముఖ్​దాస్​ జెఠ్మలానీ, పర్బతి బూల్చంద్​ దంపతులకు 1923 సెప్టెంబర్​ 14న జన్మించారు రామ్​ జెఠ్మలానీ. ఆయన అసాధారణ ప్రతిభతో 13 ఏళ్ల వయసులోనే మెట్రికులేషన్​ పూర్తిచేశారు. న్యాయవాద పట్టా పొందడానికి కనీస వయసు 21గా ఉన్నప్పటికీ ప్రత్యేక అనుమతుల మేరకు ఆయన 17 ఏళ్ల వయసులో బాంబే విశ్వవిద్యాలయం నుంచి ఎల్​ఎల్​బీ పట్టా అందుకున్నారు.
1947లో 18 ఏళ్ల వయసులోనే దుర్గను వివాహం చేసుకున్నారు జెఠ్మలానీ. అనంతరం రత్నా శహానీని రెండో వివాహం చేసుకున్నారు. భారత్​ నుంచి పాకిస్థాన్​ విడిపోయాక ముంబయి వచ్చి స్థిరపడ్డారు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయం...

దేశంలో అత్యవసర పరిస్థితుల అనంతరం 1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో శివసేన, భారతీయ జన సంఘ్​ మద్దతుతో ఉల్హాస్​నగర్​ నుంచి తొలిసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు రామ్​ జెఠ్మలానీ. అప్పటి న్యాయశాఖ మంత్రి హెచ్​ఆర్​ గోఖలేపై గెలుపొందారు. 1988లో రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.

అటల్​ బిహారి వాజ్​పేయీ ప్రభుత్వంలో 1996లో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, పరిశ్రమల వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. వాజ్​పేయీ రెండోసారి ఏర్పాటుచేసిన ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖ బాధ్యతలు నిర్వర్తించారు.

వాజ్​పేయీపై పోటీ...

2004 సార్వత్రిక ఎన్నికల్లో మాజీ ప్రధాని అటల్​ బిహారి వాజ్​పేయీపై లఖ్​నవూ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు రామ్​ జెఠ్మలానీ. తిరిగి 2010లో భాజపాలో చేరి రాజస్థాన్​ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

2013లో భాజపా నుంచి బయటకు వచ్చారు జెఠ్మలానీ.

న్యాయవాదిగా అసాధారణ గుర్తింపు..

అవిభజిత భారత్​లోని సింధ్​లో న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు జెఠ్మలానీ. విభజన తర్వాత భారత్​లో పలు కీలక కేసుల్లో తనదైన ముద్రవేశారు. అత్యవసర పరిస్థితికి ముందు, తర్వాత నాలుగు పర్యాయాలు బార్​ కౌన్సిల్​ ఆఫ్​ ఇండియాకు ఛైర్మన్​గా సేవలందించారు. 2010 మేలో సుప్రీంకోర్టు బార్​ అసోసియేషన్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996లో అంతర్జాతీయ బార్​ అసోసియేషన్​లో సభ్యుడిగానూ వ్యవహరించారు.

అత్యంత ప్రముఖులకు సంబంధించిన​ కేసులు వాదిస్తూ.. అత్యధిక పారితోషికం తీసుకునే న్యాయవాదిగా పేరొందారు రామ్​ జెఠ్మలానీ.

అండర్​ వరల్డ్ డాన్​లు, అగ్రనేతల కేసులు...

న్యాయవాద వృత్తిలో దేశంలోని ప్రముఖులు, అండర్​ వరల్డ్​ డాన్​ల కేసులను వాదించి తనదైన ముద్ర వేశారు జెఠ్మలానీ. వాటిలో కొన్ని....

  • హవాలా కుంభకోణం కేసులో భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ తరఫున వాదనలు.
  • సోహ్రబుద్దీన్​ ఎన్​కౌంటర్​ కేసులో ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తరఫున వాదనలు.
  • ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డికి సంబంధించిన మనీలాండరింగ్​ కేసు.
  • స్టాక్​ మార్కెట్​ కుంభకోణంలో హర్షద్​ మెహతా, కేతన్​ పరేఖ్​ తరఫున వాదనలు.
  • పారిశ్రామికవేత్త సుబ్రతా రాయ్​​కు సంబంధించిన సహారా-సెబీ కేసు
  • తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమ ఆస్తుల కేసు
  • అండర్​ వరల్డ్​ డాన్​ హాజీ మస్తాన్​ కేసు
  • ఉగ్రవాది అఫ్జల్​ గురు మరణ శిక్ష కేసు(శిక్షను సమర్థిస్తూ వాదనలు)

ఇదీ చూడండి: సీనియర్ న్యాయవాది​ జెఠ్మలానీ కన్నుమూత

Last Updated : Sep 29, 2019, 8:49 PM IST

ABOUT THE AUTHOR

...view details