సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రామ్ జెఠ్మలానీ కన్నుమూశారు. దిల్లీలోని స్వగృహంలో ఉదయం 7.45 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు ప్రకటించారు. 95 ఏళ్ల వయసున్న జెఠ్మలానీ గత కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆయన కుమారుడు మహేశ్ జెఠ్మలానీ వెల్లడించారు.
రాష్ట్రపతి సంతాపం...
రామ్ జెఠ్మలానీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. ప్రజల సమస్యలపై పోరాటంలో తన గళాన్ని సమర్థంగా వినిపించే వారని పేర్కొన్నారు. దేశం మంచి మేధావిని కోల్పోయిందని తెలిపారు.
జెఠ్మలానీ మృతి పట్ల మోదీ దిగ్భ్రాంతి
సీనియర్ లాయర్ రామ్ జెఠ్మలానీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. దేశం ఒక న్యాయకోవిదుడిని కోల్పోయిందని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. న్యాయస్థానాలు, పార్లమెంట్‌కు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.