రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంలలో ఫుడ్ స్టాళ్లను ఇప్పుడే తెరిచేందుకు సిద్ధంగా లేమని రైల్వే ఫుడ్ వెండింగ్ అసోసియేషన్ స్పష్టం చేసింది. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ విషయంలో తమపై ఒత్తిడి తీసుకురావొద్దని అధికారులకు విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు రైల్వే బోర్డు ఛైర్మన్‌కు అఖిల భారతీయ రైల్వే ఖాన్-పాన్ లైసెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ గుప్తా లేఖ రాశారు.
"వ్యాపారాలు ఎక్కువ కాలం పాటు మూసేసుకోవాలని ఎవరూ అనుకోరు. అయితే అనుకూలమైన పరిస్థితుల్లోనే వ్యాపారాలను నడపాలని అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్ సహా కంటైన్మెంట్ జోన్లు విధించిన నేపథ్యంలో స్టాళ్లను పునఃప్రారంభించడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి."
-రవీందర్ గుప్తా, అఖిల భారతీయ ఖాన్-పాన్ లైసెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్
చాలా వరకు దుకాణదారులు తమ స్వస్థలాలకు పయనమైనట్లు రవీందర్ పేర్కొన్నారు. కొద్ది సంఖ్యలోనే రైలు సర్వీసులు నడుస్తున్నందున.. ఇప్పుడే దుకాణాలను ప్రారంభించలేమని స్పష్టం చేశారు. స్టాళ్లను పునఃప్రారంభించడానికి కొంత సమయం ఇవ్వాలని రైల్వే బోర్డును కోరారు.
శ్రామిక్ రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో కొందరు వలస కార్మికులు స్టాళ్లను ధ్వంసం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు రవీందర్. నష్టం జరిగిన వాటికి స్థానిక అధికారులు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు.
లక్ష స్టాళ్లు
లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి స్టేషన్లలోని ఫుడ్ స్టాళ్లు మూసే ఉన్నాయి. అయితే ఈ స్టాళ్లను తెరిచేందుకు అనుమతిస్తూ మే 21న రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడుస్తున్న 9 వేల స్టేషన్లలో లక్ష వరకు ఫుడ్ స్టాళ్లు ఉన్నట్లు అంచనా.
ఇదీ చదవండి:'వలస కూలీల ఖర్చులు ప్రభుత్వమే భరించాలి'