జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో జవాన్ల విధులపై దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. ఎత్తైన ప్రదేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న కారణంగా.. ఎలాంటి యుద్ధం చేయకుండానే గడిచిన మూడేళ్లలో 22 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సియాచిన్ సహా ఇతర ఎత్తైన ప్రాంతాలు.. హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా (హెచ్ఏపీఓ), పల్మనరీ థ్రోంబోఎంబోలిజం(పీటీఈ)లకు నేరుగా సంబంధాలు ఉండటమే ఇందుకు కారణం.
జమ్ముకశ్మీర్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ.. 2019లో 8 మంది, 2018లో 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 2017లో మొత్తం ఆరుగురు మృతి చెందారు.
ఎత్తైన ప్రదేశాల్లో జవాన్ల మృతి, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై భారతీయ జనతా పార్టీ ఎంపీ గౌదర్ మల్లికార్జునప్ప సిద్దేశ్వర అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా పార్లమెంట్లో సమాధామిచ్చారు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపద్ నాయక్. ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
" జమ్ము కశ్మీర్ సరిహద్దుల వెంట అత్యంత ఎత్తైన భూభాగాల్లో సైన్యం మోహరింపులు ఉన్నాయి. అక్కడ మంచు చరియలు విరిగిపడటం వంటి ఇతర వాతావరణ విపత్తుల ముప్పు.. నిరంతరం పొంచి ఉంటుంది. సైనికుల మరణాలను నిరోధించేందుకు వైద్య సదుపాయాలు, ప్రత్యేకమైన దుస్తులు, శిక్షణ, నాణ్యమైన ఆహారం, గుడారాలు వంటి అన్నిరకాల చర్యలను ప్రభుత్వం చేపట్టింది. రెస్క్యూ మిషన్స్, ప్రమాదాల నివారణ, గాయపడిన సైనికుల సత్వర తరలింపు కోసం అధునాతన సాంకేతికతను వినియోగిస్తున్నాం."