తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​పై చైనా-పాక్ చర్చలు జరపడంపై భారత్ ఆగ్రహం

కశ్మీర్​పై చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ చర్చలు జరిపారన్న వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో ఇతర దేశాలు వ్యాఖ్యానించడం సరికాదని హెచ్చరించింది.

కశ్మీర్​పై మీరెవరు వ్యాఖ్యలు చేయడానికి? : భారత్ ఆగ్రహం

By

Published : Oct 9, 2019, 8:19 PM IST

Updated : Oct 9, 2019, 10:00 PM IST

కశ్మీర్​పై చైనా-పాక్ చర్చలు జరపడంపై భారత్ ఆగ్రహం

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్, పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్ కశ్మీర్​పై చర్చలు జరుపుతున్నట్లు వచ్చిన వార్తలపై భారత్​ తీవ్రంగా స్పందించింది. భారత్​ గురించి చైనాకు బాగా తెలుసునని, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం సరికాదని హెచ్చరించింది.

కశ్మీర్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రవీశ్​కుమార్ తీవ్రంగా ఖండించారు.

"కశ్మీర్​పై ఇమ్రాన్​ఖాన్​-జిన్​పింగ్ చర్చించిన విషయాలను మేము పరిశీలించాం. జమ్ము కశ్మీర్ భారత్​లో అంతర్భాగం. చైనాకు భారత్​ గురించి తెలుసు. భారత అంతర్గత వ్యవహారాలపై ఇతర దేశాలు వ్యాఖ్యానించడం సరికాదు." - రవీశ్​కుమార్​, భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి

పాక్​.. చీనీ కుయుక్తులు

ఇవాళ పాక్ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​తో సమావేశమైన చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.. ఆర్టికల్ 370 రద్దు తరువాత కశ్మీర్​లో జరుగుతున్న పరిణామాలను చైనా నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. ఇరుదేశాలు శాంతి చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే ఆర్టికల్ 370ని భారత్ రద్దుచేయడాన్ని వ్యతిరేకిస్తున్న పాక్.. చైనా సాయం కోసం అర్రులు చాస్తున్న విషయం తెలిసిందే. ఇదే అదునుగా చైనా తనదైన రాజకీయం చేస్తోంది.

మోదీతో భేటీకి ముందు..

ప్రధాని నరేంద్ర మోదీతో రెండో అనధికార సమావేశం కోసం జిన్​పింగ్ ఆక్టోబర్ 11న భారత్​కు రానున్నారు. ఇలాంటి కీలక సమయంలో పాక్ ప్రధానితో భేటీ అయిన పింగ్​.. పాక్-చైనా స్నేహం దృఢమైనది, విడదీయరానిదని వ్యాఖ్యానించడం, కశ్మీర్​పై అనవసర ప్రసంగం చేయడం గమనార్హం.

ఇదీ చూడండి: 'కాంగ్రెస్​కు భారతీయత తెలియదు- వారిది ఇటలీ సంస్కృతి'


Last Updated : Oct 9, 2019, 10:00 PM IST

ABOUT THE AUTHOR

...view details