కరోనా వ్యాక్సిన్ అందరరికీ ఇవ్వాల్సిన అవసరం లేదని 7 రాష్ట్రాలకు చెందిన ప్రజా వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి మంగళవారం లేఖ రాశారు. ఇలా ఆదా ఆయిన డబ్బుతో దేశంలో వైద్య ఆరోగ్య వ్యవస్థను అధునాతనంగా తీర్చిదిద్దడం వల్ల ఎక్కువ ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
దీనిపై సంతకం చేసిన వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ ఆర్. శ్రీవాత్సవ్ ఉన్నారు.
"సురక్షిత, సమర్థమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే కొవిడ్ నుంచి అధికముప్పు ఎదుర్కొంటున్న కొద్ది మందికి అందిస్తే సరిపోతుంది. మిగతా ప్రజలందరూ తమను తాము రక్షించు కోవడానికి ఔషధేతర విధానాలను తప్పనిసరిగా ఆనుసరించేలా, ఆసుపత్రి అవసరమైన వారికి నాణ్యమైన వైద్యం అందేలా చూస్తే సరిపోతుంది. సరైన వైద్యసేవలు లేకపోవడం వల్లే ఎక్కువ శాతం మరణాలు సంభవించినట్లు మా దగ్గరున్న సమాచారం ఆధారంగా తెలుస్తోంది. అందువల్ల అవసరమైన వారికి మాత్రమే టీకా అందించి, తద్వారా ఆదా అయిన డబ్బును ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఉపయోగించాలి.
ప్రతి జిల్లాలో కనీసం 700 పడకలతో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించే ఆసుపత్రులతో కూడిన వైద్యకళాశాలలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల కరోనాను ఎదుర్కోవడమే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి మహమ్మారులనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి.