ప్రజలు ఏ మేరకు పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారన్నది కూడా ఒక దేశ ఆర్థిక పరిస్థితికి సంకేతంలా నిలుస్తుంది. భారత్‌లో గత మూడు దశాబ్దాల్లో ప్రజల ఆర్థిక స్థితిగతుల్లో వచ్చిన మార్పులు ఆహార అలవాట్లను మార్చివేశాయి. వ్యవసాయ ఉత్పత్తులూ గణనీయంగా పెరిగాయి. అయినా ఇప్పటికీ దేశంలో 15శాతం జనాభాకు ఆకలి బాధలు తప్పడంలేదు. మొత్తం 117 దేశాల నుంచి సేకరించిన సమాచారంతో రూపొందించిన ప్రపంచ ఆకలి సూచీ-2019లో భారత్‌ది 102వ స్థానం. దేశంలో దాదాపు 19 కోట్ల మంది పౌష్టికాహార సమస్యలతో బాధపడుతున్నారు. ఇందులో 15 నుంచి 49 ఏళ్లలోపు వయసున్న మహిళల్లో 51శాతం అత్యంత బలహీనంగా ఉంటున్నారని ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) నివేదిక పేర్కొంది. చాలామంది రక్తహీనత సమస్యలు ఎదుర్కొంటున్నారు. 2019లో చిన్నారుల స్థితిపై యునిసెఫ్ నివేదిక ప్రకారం చనిపోతున్న అయిదేళ్లలోపు పిల్లల్లో 69శాతం సరైన పౌష్టికాహారం లభించక ప్రాణాలు విడుస్తున్నారు.
2018 ప్రపంచ పోషణ నివేదిక మేరకు 4.66 కోట్ల మంది పిల్లలు వారి వయసుకు తగ్గ ఎత్తు పెరగడం లేదు. 2.56 కోట్ల మంది చిన్నారులు ఎత్తుకు తగిన బరువు ఉండటం లేదు. దేశ ప్రజలకు సంపూర్ణ పౌష్టికాహార లభ్యత ఇప్పట్లో సాధ్యమేనా అన్న ప్రశ్నకు సమాధానం లభించడం కష్టమే. అత్యధికులు సమతులాహారానికి దూరంగా ఉండిపోతున్నారు. జాతీయ పోషణ సంస్థ (ఎన్‌ఐఎన్) ఇటీవల విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
పిండిపదార్థాల వినియోగమే అధికం
దేశంలో అత్యధికుల ఆహారంలో పిండిపదార్థాల శాతమే ఎక్కువగా ఉంటోందని, మాంసకృత్తులు వంటి ఇతర పోషకాల శాతం చాలా పరిమితమేనని ఎన్‌ఐఎన్ తన నివేదికలో పేర్కొంది. ఒక వ్యక్తికి నిత్యం లభించాల్సిన శక్తిలో 45శాతం మేర మాత్రమే పిండిపదార్థాల ద్వారా అందాలి. మిగిలిన శక్తి మొత్తం ప్రొటీన్లు తదితర పోషకాల ద్వారా లభించాలి. అంటే ధాన్యం, పప్పు దినుసులు, పాలు, కూరగాయలు, మాంసాహారం వంటి వాటన్నింటి ద్వారా మనిషికి కావాల్సిన శక్తి లభించాలి.
గ్రామీణుల్లో 65శాతం శక్తి కేవలం పిండిపదార్థాల రూపంలోనే వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికీ ఆహారం ద్వారా లభించే శక్తిలో 51శాతం పిండిపదార్థాల ద్వారానే లభిస్తుండటం గమనార్హం. మాంసకృత్తుల ద్వారా 17శాతం శక్తి పొందాల్సి ఉండగా, సగటున 11శాతం మాత్రమే లభిస్తున్నట్లు ఎన్‌ఐఎన్ అధ్యయనంలో వెల్లడైంది. పోషకాహార అసమతౌల్యం మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలకూ కారణమవుతోంది. దేశంలో పాలు, కూరగాయలు, మాంసం ఉత్పత్తులు గణనీయంగా పెరుగుతున్నా- వాటి వినియోగం తక్కువగా ఉంటోంది. ఒక వ్యక్తి నిత్యం తీసుకునే ఆహారంలో 300 గ్రాముల కూరగాయలు ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతారు. దేశంలో ప్రస్తుతం సుమారు 18.5 కోట్ల టన్నుల కూరగాయలు ఏటా ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో ఉంటున్న వారిలో 17శాతం, గ్రామీణుల్లో తొమ్మిది శాతం మాత్రమే నిత్యం అవసరమైన మేరకు కూరగాయలు తింటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.