మహారాష్ట్రలో శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో ఆసక్తికర విషయం తెలిపారు. అజిత్ పవార్‌తో దేవేంద్ర ఫడణవీస్ సంప్రదింపులు జరిపిన విషయం తనకు తెలుసని వెల్లడించారు. కాంగ్రెస్‌తో చర్చలు సాగిన తీరు పట్ల అసంతృప్తితోనే తొలుత భాజపాతో ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ మద్దతిచ్చారని శరద్ పవార్ చెప్పారు.
భాజపాతో జట్టుకట్టడం కంటే శివసేనతో కూటమిగా ఏర్పడటమే మేలని వ్యాఖ్యానించారు పవార్. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానన్నారు. భాజపాకు ఎన్సీపీ మద్దతు సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేనలకు ఒకరి సిద్ధాంతాల పట్ల మరొకరికి పూర్తి అవగాహన ఉందన్నారు శరద్ పవార్. మరో ఐదేళ్ల పాటు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.