భారతీయులకు క్రికెట్ అంటే ఎంత మక్కువో మరోసారి రుజువైంది. ప్రపంచాన్నంతా ఆవహించిన కరోనా సంక్షోభంలోనూ ఈ ఆటకు క్రేజ్ తగ్గలేదని నిరూపితమైంది. గూగుల్‌లో ఈ ఏడాది అత్యధిక మంది శోధించిన కీవర్డ్స్ జాబితాలో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. కరోనా వైరస్ పదంతో పోలిస్తే ఐపీఎల్‌తోనే ఎక్కువ శోధనలు జరిగాయని గూగుల్ వెల్లడించింది. ఈ మేరకు భారత్‌లో అత్యధిక మంది వేటిని సెర్చ్ చేశారనే విషయాలపై జాబితా రూపొందించింది.
క్రీడలు, వార్తల విభాగంలోనూ ఐపీఎల్ కీవర్డే సత్తా చాటింది. ఆ తర్వాత కరోనా వైరస్ నిలిచింది. అమెరికా ఎన్నికల ఫలితాలు, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం కిసాన్ పథకం), బిహార్ ఎన్నికల ఫలితాలు, దిల్లీ ఎన్నికల ఫలితాలు, నిర్భయ కేసు, లాక్డౌన్, భారత్-చైనా ఉద్రిక్తతలు, రామ మందిరం పదాలు టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
కరోనా కారణంగా తొలుత వాయిదా పడిన ఐపీఎల్ పదమూడో సీజన్.. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 మధ్య నిర్వహించారు. మ్యాచులకు ప్రేక్షకులను అనుమతించలేదు. అయితే వ్యూయర్షిప్ మాత్రం రికార్డులు తిరగరాసింది. గతేడాదితో పోలిస్తే 28 శాతం అధికంగా ఐపీఎల్‌ను వీక్షించారు. ఈ సంవత్సరం ఐపీఎల్ గురించి అత్యధిక మంది వెతికితే 2019లో 'ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్' గురించి భారతీయులు ఎక్కువగా శోధించారు.
ఇదీ చదవండి:ఈ ఏడాది ట్విట్టర్లో సందడంతా ఈ ట్వీట్స్దే!
మరోవైపు, అత్యధిక మంది సెర్చ్ చేసిన క్రీడా ఈవెంట్లలో యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్, ఫ్రెంచ్ ఓపెన్, లా లీగా చోటు దక్కించుకున్నాయి.
వ్యక్తుల గురించి
ఎక్కువ మంది శోధించిన ప్రముఖుల జాబితాలో అమెరికా తదుపరి అధ్యక్షుడు జో బైడెన్, ముంబయి పోలీసుల అరెస్టుతో వార్తల్లోకెక్కిన జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామి, సింగర్ కనికా కపూర్ పేర్లు ఉన్నాయి.