తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం మోదీకి లేదు' - కేజ్రీవాల్​ ట్వీట్​

వ్యవసాయ చట్టాలపై నిరసన చేస్తున్న రైతులతో ముఖాముఖిగా మాట్లాడే ధైర్యం ప్రధానికి లేదని అన్నారు కాంగ్రెస్​ లోక్​ సభాపక్షనేత అధిర్​ రంజన్​ చౌధరి. కర్షకుల ఖాతాల్లోకి ప్రభుత్వం వేస్తామంటున్న రూ.18000 కోట్లు లబ్ధిదారులకు చేరకుండా.. దళారీ వ్యవస్థ అడ్డుపడుతోందని అన్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు నిరుపయోగమైనవని దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు.

Not a single benefit, a lot of harm: Kejriwal on farm laws
"రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం మోదీకి లేదు"

By

Published : Dec 25, 2020, 7:24 PM IST

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి నష్టం జరగదంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించిన వేళ ప్రతిపక్ష కాంగ్రెస్‌ మరోసారి ప్రభుత్వంపై విమర్శలకు దిగింది. ప్రధానికి రైతులతో నేరుగా మాట్లాడే ధైర్యం లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌధురీ దుయ్యబట్టారు. కిసాన్‌ కల్యాణ్‌ సమ్మేళన్‌ పేరుతో మధ్యప్రదేశ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోదీ నేడు వర్చువల్‌గా పాల్గొని సాగు చట్టాలపై రైతులతో మాట్లాడారు. దీనిపై అధీర్‌ రంజన్‌ స్పందిస్తూ.. ‘రూ. 18వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకే బదిలీ చేశామని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఆ నగదు మొత్తం రైతులకు చేరట్లేదు. మధ్యలో కొంతమంది జేబుల్లోకి వెళ్తోంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా దిల్లీ సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళన సాగిస్తున్నారు. ప్రధానికి నేరుగా రైతులతో మాట్లాడే ధైర్యం లేదు. అందుకే చర్చల్లో పాల్గొనట్లేదు’ అని విమర్శించారు.

ప్రయోజనం లేని చట్టాలు: కేజ్రీవాల్‌

అటు రైతుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కొత్త సాగు చట్టాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ‘నూతన చట్టాలతో అన్నదాతలకు ఎలాంటి హానీ జరగబోదని భాజపా చెబుతోంది. కానీ వీటి వల్ల ప్రయోజనం ఏంటీ? రైతులు తమ పంటను మార్కెట్‌ వెలుపల ఎక్కడైనా అమ్ముకోవచ్చని ప్రభుత్వం అంటోంది.. కానీ, మార్కెట్‌ వెలువల పంటలకు సగం ధరే దక్కుతుంది. అలాంటప్పుడు రైతులకు ఎలా ప్రయోజనం చేకూరుతుంది?’ అని కేజ్రీవాల్‌ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

సాగు చట్టాలపై రైతుల ఆందోళన కొనసాగుతున్న వేళ ప్రధాని మోదీ నేడు కీలక ప్రసంగం చేసిన విషయం తెలిసిందే. కొత్త చట్టాల వల్ల దేశంలో ఏ ఒక్క రైతూ భూమిని కోల్పోయే అవకాశం లేదని ప్రధాని భరోసా ఇచ్చారు. తమ పాలనలో దళారీ వ్యవస్థకు చోటే లేదని వ్యాఖ్యానించారు. ఈ చట్టాల నెపంతో కొంతమంది రాజకీయాలు చేస్తున్నారంటూ విపక్షాలపై విరుచుకుపడ్డారు.

ఇదీ చదవండి:రైతు పోరు ఉద్ధృతం- చర్చలపై నేడు నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details