ఉత్తర భారతంలో చలి తీవ్రత నానాటికి పెరిగిపోతోంది. ఆదివారం చాలా చోట్ల ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. పలు నగరాలను పొగమంచు కమ్మేసింది. ఫలితంగా రైలు, విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
దిల్లీలో రెడ్ అలర్ట్..
దేశ రాజధాని దిల్లీని శీతల గాలులు ముంచెత్తుతున్నాయి. దశాబ్దాల కనిష్ఠ స్థాయిలో లోథి రోడ్‌లో 2.8, సఫ్దర్‌జంగ్‌లో 2.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదివారం దిల్లీలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు.. 19.07 డిగ్రీలుగా నమోదయ్యాయి. 1997 డిసెంబర్లో నమోదైన 17.3 డిగ్రీల తర్వాత ఇవే అతి తక్కువ సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కావడం గమవార్హం.
లద్దాఖ్‌లో.. మైనస్ 19 డిగ్రీలు
జమ్ముకశ్మీర్‌లో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలతో అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. లేహ్ లద్దాఖ్‌లో రికార్డు స్థాయిలో మైనస్ 19 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శ్రీనగర్ బనిహాల్ నగరంలో ఆదివారం మైనస్ 2.2 డిగ్రీలు, డోడా జిల్లాలోని భదర్వలో మైనస్ 0.8 డిగ్రీలు, ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్లో మైనస్ 6.6 డిగ్రీలు, దక్షిణ కశ్మీర్‌లోని అమర్నాథ్ యాత్రకు సంబంధించిన బేస్ క్యాంపు వద్ద మైనస్ 10.4 డిగ్రీలతో దట్టమైన మంచు కురుస్తోంది.