ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. కశ్మీర్‌లోయలో అతిస్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే 40 రోజుల 'చిల్లయి కలాన్' సీజన్ ప్రారంభమైంది. ఉత్తర కశ్మీర్‌లోని గుల్మార్గ్లో అత్యల్పంగా -9.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. అమర్నాథ్ పర్యటకుల బేస్ క్యాంప్ అయిన పహల్గావ్లో 21 సెంటీమీటర్ల మేర హిమపాతం నమోదైంది. కాజీకుండ్లో 38.5 సెంటీమీటర్ల మంచు కురిసింది. శ్రీనగర్‌లో -0.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా లద్దాఖ్ ప్రాంతంలోని లేహ్ జిల్లాలో -9.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత ఉంది.
పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోనూ చలి వణుకు పుట్టిస్తోంది. బఠిండాలో అత్యల్పంగా 5.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమృత్సర్, లూథియానాలో భారీగా పొగమంచు ఏర్పడింది. ఈ ప్రాంతాల్లో వరుసగా 6.6, 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంబాలా, హిసార్, కర్నాల్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. ఛండీఘర్‌లో అత్యల్పంగా 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
హిమాచల్ ప్రదేశ్ కీలాంగ్ ప్రాంతంలో 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా మనాలీ, చంబా ప్రాంతంలో 9 సెంటీమీటర్ల హిమపాతం కురిసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2 నుంచి 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రత పడిపోయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.