బిహార్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహప్రతివ్యూహాల్లో నిమగ్నమై ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గట్టి పట్టున్న సంప్రదాయ పార్టీలకు తోడుగా పొరుగు రాష్ట్రాల్లోని బలమైన పక్షాలు.. బిహారీ గడ్డపై గెలుపు మార్గం వెతికే పనిలో పడ్డాయి.
సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్, ఝార్ఖండ్ ముక్తి మోర్చా తదితర పార్టీలు.. ఎన్నికల్లో విజయం సాధించకపోయినా ప్రధాన పార్టీల ఓట్లు చీల్చి.. ఫలితాలను ప్రభావితం చేసే స్థాయిలోనే ఉన్నాయి.
ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ కసరత్తులు
1999లో తారిఖ్ అన్వర్ కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి వేరు కుంపటి పెట్టుకున్నారు. శరద్ పవార్, పీఏ సంగ్మాతో కలిసి ఎన్సీపీని స్థాపించారు. అన్వర్ గతంలో బిహార్లోని కతిహార్ ఎంపీగానూ పని చేశారు. 2018లో అన్వర్ ఎన్సీపీని వీడినప్పటి నుంచి బిహార్లో ఆ పార్టీకి గడ్డుకాలం మొదలైంది. క్షేత్రస్థాయిలో బలం కొల్పోతూ వస్తోంది. ఇక సమాజ్వాదీ, బీఎస్పీ పరిస్థితి కూడా ఇలాగే ఉంది.
2015లో తీవ్ర నిరాశ
2015లో బిహార్ శాసనసభ ఎన్నికల్లో సమాజ్వాదీ, ఎంఐఎం, జేఎమ్ఎమ్ పార్టీలు ప్రచారంతో హోరెత్తించి పోటీ చేసినా.. ఒక్క సీటు గెలవలేకపోయాయి. ఆ ఎన్నికల్లో ఝార్ఖండ్ ముక్తి మోర్చా 32 చోట్ల పోటీచేసింది. సమాజ్వాదీ పార్టీ ఏకంగా 135మంది అభ్యర్థులను బరిలోకి దించింది. ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం కూడా సీమాంచల్ పరిధిలోని 6 స్థానాల్లో తమ అదృష్టం పరీక్షించుకుంది. వీటితో పాటు మరికొన్ని ఇతర ప్రాంతీయ పార్టీలు పోటీ చేసినా రిక్తహస్తాలే మిగిలాయి.
సమరంలో సమాజ్వాదీ పార్టీ..
బిహార్లో సమాజ్వాదీ పార్టీ ప్రభావం క్రమంగా తగ్గిపోతోంది. శాసనసభ ఎన్నికల్లో పార్టీ ప్రదర్శన తీసికట్టుగా తయారవుతోంది. 2005లో ఎస్పీ 142 స్థానాల్లో బరిలోకి దిగి నాలుగు స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇక అప్పటినుంచి ఎస్పీ సైకిల్ తిరోమనంలోనే ఉంది. వరసగా 2010, 2015 శాసనసభ ఎన్నికల్లో సున్నాకే పరిమితమైంది.
జాడలేని జేఎంఎం..
బిహార్ సరిహద్దు రాష్ట్రం ఝార్ఖండ్. ప్రస్తుతం అక్కడి అధికార పార్టీ ఝార్ఖండ్ ముక్తి మోర్చా .. బిహార్ ఎన్నికల్లో ఒక్కసారి మాత్రమే విజయం రుచి చూసింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో 41 స్థానాల్లో పోటీకి దిగిన జేఎంఎం.. ఒక్క సీటుకే పరిమితమైంది. ఆ తర్వాత 2015లో 32 మందిని బరిలో నిలిపినా ఖాతా తెరవలేకపోయింది.
ఓవైసీ సత్తా చాటేనా..