దేశవ్యాప్తంగా దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న లాక్డౌన్ ప్రభావం రోజూవారి కూలీలపైనా భారీగా పడింది. దిల్లీలోని వలసయేతర కార్మికుల వారపు ఆదాయం కనీసం 57 శాతం తగ్గిందని అమెరికా, కెనడా విశ్వవిద్యాలయాలు చేసిన సంయుక్త అధ్యయనంలో తేలింది.
అధ్యయనం కోసం 1,392 మంది వలసయేతర కూలీల నుంచి సమాచారాన్ని సేకరించారు. వీరిలో ఎక్కువ మంది దిల్లీ అనధికార స్థావరాల్లో నివసిస్తున్నారు. 2018, 2019, లాక్డౌన్ సమయంలో (మార్చి27 నుంచి మే 13) మధ్య ఈ సర్వే జరిపారు.
ఆదాయం నిల్...
మే మొదటి వారం నాటికి, ప్రతి 10మందిలో తొమ్మిది మందికి వారపు ఆదాయం సున్నాకి పడిపోయిందని షికాగో, బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయాలు నిర్వహించిన అధ్యయనం తెలిపింది. లాక్డౌన్కు ముందు, ఆ తర్వాత వలసయేతర కార్మికుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనంలో పోల్చి చూశారు పరిశోధకులు.
మేము నిర్వహించిన సర్వేలో.. లాక్డౌన్కు ముందు వారపు ఆదాయం సగటు రూ.2,994కాగా.. మొదటి లాక్డౌన్లో రూ.1,828కు తగ్గింది. ఇక రెండో రౌండ్లో రూ.412కు పరిమితమైంది.