ప్రపంచవ్యాప్తంగా పదుల కోట్లమంది అభాగ్యుల జీవితాలతో నిరంతరం మృత్యుక్రీడలాడుతున్న నిశ్శబ్ద హంతకి పేరు పేదరికం. అభివృద్ధికి ఆఘాతంగా, సమర్థ మానవ వనరుల వికాసానికి విఘాతంగా మారిన పేదరికాన్ని పరిమార్చడానికంటూ భిన్న పథకాలు ప్రణాళికలతో ప్రభుత్వాలు సాగిస్తున్న పోరు సత్ఫలితాలివ్వడం లేదన్నది నిష్ఠుర సత్యం. ప్రపంచవ్యాప్త పేదరికంపై పోరాటానికి అనుసరించాల్సిన అత్యుత్తమ మార్గాలేమిటో తెలుసుకొనేలా సరికొత్త విశ్వసనీయ విధానాల్ని పరిచయం చేసినందుకు ఈ ఏడాది అభిజిత్ బెనర్జీ, ఈస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ముంబయిలో పుట్టి, అప్పటి కలకత్తా ప్రెసిడెన్సీ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టా పొంది, దిల్లీలోని జేఎన్‌యూలో స్నాతకోత్తర చదువు పూర్తిచేసి, విఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ చేసిన అభిజిత్ బెనర్జీకి, ఆయన సతీమణి డఫ్లోకు నోబెల్ పురస్కారం దక్కడం భారతీయులందర్నీ పులకితాంతం చేస్తోంది.
సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం
పేదరికం కొలమానాలపై విస్తృత పరిశోధనలకుగాను 2015లో అంగుస్ డీటన్‌కు ‘నోబెల్’ దక్కింది. సమస్య లోతుల్లోకి వెళ్లకుండా పేదరిక నిర్మూలన పేరిట లెక్కకు మిక్కిలి పథకాలు పెట్టి వేలకోట్ల రూపాయలు వ్యయీకరించడం వల్ల ప్రయోజనం లేదని, ఎక్కడ ఏయే వర్గాలకు వాస్తవికంగా ఏమేమి అవసరమో విశ్లేషించి తగు పరిష్కారాలతో ముందడుగేస్తే మంచి ఫలితాలు అందుకోగలమని అభిజిత్-డఫ్లో-క్రెమర్‌ల రెండు దశాబ్దాల ప్రయోగ ఫలితాలు నిర్ధారిస్తున్నాయి. అబ్దుల్ లతీఫ్ జమీల్ పేదరిక కార్యాచరణ ప్రయోగశాలను 2003లో నెలకొల్పిన అభిజిత్ బెనర్జీ- పాఠశాలల్లో దిగనాసి విద్యాప్రమాణాలు, పిల్లల్లో అనారోగ్యం వంటి రుగ్మతలకూ మూలకారణాల్ని అన్వేషించి, వాటికి సరైన మందు వేయడం ద్వారా ముందడుగేయగలమని నిర్ద్వంద్వంగా నిరూపించారు. ఈ ముగ్గురు దిగ్దంతుల ప్రయోగశీల విధానాలు అభివృద్ధి ఆర్థికానికి కొత్తరెక్కలు తొడిగాయని నోబెల్ కమిటీ ప్రస్తుతిస్తుంటే, సూక్ష్మరుణాల పథకంపై అభిజిత్-డఫ్లోల ప్రాథమిక అధ్యయన కేంద్రం హైదరాబాదే కావడం తెలుగువారికీ ఆనందదాయకం అవుతోందిప్పుడు!
పేదరికాన్ని అర్థం చేసుకోకపోతే ప్రయోగాలు విఫలమే
పేదరికం ఎక్కడ ఏ రూపంలో ఉన్నా తుదముట్టించాలన్నది ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో మొట్టమొదటిది. మానవాళిలో పదిశాతం, అంటే 70కోట్ల మందికిపైగా ప్రజలు దుర్భర పేదరికంలో అల్లాడుతూ ఆరోగ్యం, విద్య, మంచినీరు, పారిశుద్ధ్యం వంటి కనీసావసరాలకూ నోచుకోవడం లేదన్న సమితి- 2030నాటికి కూడా పేదరిక సమూల నిర్మూలన సాధ్యమయ్యే వాతావరణం లేదని ఇటీవలే ప్రకటించింది. 55 శాతం జనావళికి సామాజిక భద్రతా కవచాలూ అందుబాటులో లేని తరుణంలో- గుడ్డెద్దు చేలో పడ్డ చందం కాకుండా పరిమిత వనరుల్ని గరిష్ఠ ప్రయోజనదాయకంగా ఎలా వినియోగించగల వీలుందో అభిజిత్ బృందం ప్రయోగాలు కళ్లకు కడుతున్నాయి. పేదరికాన్ని విధానకర్తలు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్లనే ఆయా పథకాలు విఫలమవుతున్నాయనే అభిజిత్ బెనర్జీ- ‘ప్రపంచ పేదరిక పోరాట పంథా మీద విప్లవాత్మక పునరాలోచన’ పేరిట రాసిన పుస్తకం సంచలనం సృష్టించింది.