తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సాహిత్య' నోబెల్​లో అమ్మ భాషకే అందలం - సంపాదకీయం

తల్లి జన్మనిస్తే, తల్లిభాష వికాసాన్ని ఇస్తుంది. అమ్మ సాంగత్యంలో బిడ్డకు కలిగే ఆహ్లాదంలా, అమ్మభాష రచనల్లో అనంత సౌకర్యం కలగజేస్తుంది. మాతృభాషలో మాదిరిగా మరే ఇతర భాషలోనూ సరైన భావాలను పలికించలేం. మాతృభాషల్లో రాసినవారే ఎక్కువ మంది నోబెల్‌ పురస్కారాలు అందుకోవడం ఇందుకు నిదర్శనం. 2018 సంవత్సరానికి పోలెండ్‌ రచయిత్రి ఓల్గా టోర్కర్విజ్‌ మాతృభాష పోలిష్‌లో రాసిన నవలల ఆంగ్ల అనువాదానికి, 2019వ సంవత్సరానికి ఆస్ట్రియా నవల, నాటక రచయిత పీటర్‌ హండ్కే తన మాతృభాష జర్మన్‌లో రాసిన సాహిత్యానికి సంబంధించిన ఆంగ్ల అనువాదానికి నోబెల్‌ సాహిత్య బహుమతులు అందుకున్నారు.

అమ్మ భాషవైపే నోబెల్​ సాహిత్య పురష్కారాలు

By

Published : Oct 30, 2019, 12:36 PM IST

ప్రపంచ సాహిత్య చరిత్రలో 19వ శతాబ్దం ద్వితీయార్ధం విక్టోరియా మహారాణి పాలన కాలంలో ఆంగ్లేయ నవలాకారులు చార్లెస్‌ డికెన్స్‌, జార్జ్‌ ఇలియట్‌, చార్లెటో బ్రాంటే, థామస్‌ హార్డీ, ఎమిలీ బ్రాంటే, శామ్యూల్‌ బట్లర్‌ రచనలు విక్టోరియన్‌ నవలలుగా ప్రసిద్ధిగాంచాయి. వారి రచనల్లో చరిత్ర, సంస్కృతి, పారిశ్రామికీకరణ, మానవ సంబంధాలు ఇతివృత్తాలుగా నిలిచాయి. 20వ శతాబ్దంలో అమెరికన్‌ నవలాకారులు ‘సంక్షిప్తత తెలివికి ఆత్మ’ అనే ఆలోచనతో తక్కువ పదాల్లో ఎక్కువ భావాలతో సంక్షిప్త నవలలు రచించి నవలా సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించారు. అలా రాసిన నూటపాతిక పేజీల ‘ఓల్డ్‌మన్‌ అండ్‌ ద సి’ అనే బుల్లి నవలకు ఎర్నెస్ట్‌ హెలింగ్వే నోబెల్‌ సాహిత్య బహుమతిని అందుకున్నారు. సామాన్య మానవుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని సంఘటనలు సృష్టించి వారి మాతృభాషలో ఆయాపాత్రలకు ఆయన ప్రాణం పోశారు.

ఉద్యమానికి రచనలతో సజీవరూపాన్నిచ్చిన ఓల్గా

ఓల్గా రాసిన ‘బక్స్‌ ఆఫ్‌ జాకట్‌’ అనే నవల మూడు మతాలు, అయిదు భాషలు, ఏడు దేశాలను సృజించిన ఒక యూదు ఆధ్యాత్మిక చరిత్రకు అక్షర రూపం. 18వ శతాబ్దంలో పోలెండ్‌లో జరిగిన ‘ప్రాంకీజం’ అనే ఉద్యమానికి రచయిత్రి సజీవరూపాన్నిచ్చి ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికారు. 2017లో మాతృభాష పోలిష్‌లో ఓల్గా రచించిన ‘బైగుని’ 2018లో ఆంగ్లభాషలో ‘ప్లైట్స్‌’గా తర్జుమా అయి బుకర్‌ ప్రైజ్‌ అందుకుంది. తమ దేశ అత్యున్నత సాహిత్య బహుమానం ‘నైకిలిటరరీ’ని ఆమె నిరుడు అందుకున్నారు. నోబెల్‌ సాహిత్య బహుమతి అందుకున్న మహిళల్లో ఓల్గా పదిహేనోవారు.

అమ్మ వేదన అద్దం పట్టేలా రచన

న్యాయవాద విద్యను అర్ధాంతరంగా ముగించి రచయితగా స్థిరపడ్డ పీటర్‌ రచనలన్నీ ప్రాథమికంగా మాతృభాష జర్మన్‌లోనే సాగాయి. తల్లి ఆత్మహత్య నేపథ్యంలో రచించిన వంద పుటల ‘ఎ సారో బియాండ్‌ డ్రీమ్స్‌’ అనే నవల పాఠకులను బాగా ఆకర్షించింది. ఇందులో పీటర్‌ తన తల్లి ఆవేదన, మానసిక సంఘర్షణ, మానవ సంబంధాలను హృద్యంగా అక్షరీకరించారు. జర్మన్‌ రచయిత పీటర్‌ ఆ దేశ చలన చిత్రాలకు సాహిత్యాన్ని అందించి అనేక బహుమతులు అందుకున్నారు.

మాతృ భాషకే ప్రాధాన్యం

ఇప్పటివరకు సాహిత్యంలో నోబెల్‌ బహుమతులు 116 మందిని వరించాయి. వీరిలో ఆంగ్లంలో ప్రత్యక్షంగా రాసినవారు 29 మంది, తమ మాతృభాషతోపాటు ఆంగ్లంలో రాసినవారు ముగ్గురు మాత్రమే కావడం గమనార్హం. 1913లో ‘గీతాంజలి’కి నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకున్న రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మొదటి ఆసియా వాసి. తరవాత ఆ పుస్తకాన్ని ఆయన ఆంగ్లంలోనూ రచించారు. కరేబియన్‌ దీవులైన ట్రినిడాడ్‌ టొబాగోకు చెందిన భారతీయ సంతతి వాసి విదియధర్‌ సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌ 2001లో నోబెల్‌ సాహిత్య బహుమతి అందుకున్నారు. 14 మంది చొప్పున ఫ్రెంచ్‌, జర్మన్‌ రచయితలు, 11 మంది స్పానిష్‌, ఏడుగురు స్వీడిష్‌, ఆరుగురు ఇటాలియన్లు, ఆరుగురు రష్యన్లు, అయిదుగురు పోలిష్‌, ముగ్గురు డానిష్‌, ముగ్గురు నైజీరియన్లు, ఇద్దరు చొప్పున చైనీస్‌, గ్రీస్‌, జపనీస్‌ రచయితలు తమ మాతృభాషల్లో రచనలు చేసి నోబెల్‌ బహుమతులు స్వీకరించారు. వీరిలో ఫ్రాన్స్‌ నుంచి అత్యధికంగా 16 మంది, అమెరికా నుంచి 12, ఇంగ్లాండ్‌ నుంచి 11, జర్మనీ, స్వీడన్‌ల నుంచి చెరో ఎనిమిది మంది, పోలెండ్‌, ఇటలీ, స్పెయిన్‌ల నుంచి చెరో ఆరుగురు, ఐర్లాండ్‌ నుంచి నలుగురు, డెన్మార్క్‌, నార్వేల నుంచి ముగ్గురు చొప్పున నోబెల్‌ సాహిత్య బహుమతులు అందుకున్నారు.

భారతీయులు అపోహలను తీసేయండి

సాహిత్యంలో అంతర్జాతీయ బహుమతులు అందుకోవాలంటే ఆంగ్లంలోనే రచనలు చేయాలన్న అపోహ భారతీయుల్లో ఉంది. ప్రఖ్యాత భారతీయ ఆంగ్ల రచయితలు సల్మాన్‌ రష్దీ, అరుంధతీ రాయ్‌, కిరణ్‌ దేశాయ్‌, అరవింద్‌ అడిగలను వీరు ఉదాహరణలుగా తీసుకుంటారు. నేరుగా ఆంగ్లంలో రచనలు చేస్తున్న భారతీయులు బుకర్‌ సాహిత్య బహుమతులు అందుకుంటున్నారు. భారతీయులు తమ మాతృభాషల్లో చేసిన రచనలు ఆంగ్ల అనువాదానికి నోచుకోక అంతర్జాతీయ సమాజానికి తెలియడంలేదు. ప్రాంతీయ భాషల్లో పేరెన్నికగన్న గ్రంథాలు సైతం తర్జుమా కావడం లేదు. అనువాద సాహిత్యంలో భారత్‌ చాలా వెనకబడి ఉంది. ఒక భాష నుంచి వేరొక భాషలోకి అనువాదం కావాలంటే రచయితకు రెండు భాషల్లో సమగ్రమైన అవగాహన అవసరం. రవీంద్రుడు తన బెంగాలీ ‘గీతాంజలి’ గొప్పదనం ఆంగ్ల భాషలోకి బదిలీ కాలేదని ఆవేదన చెందారు.

ఐరోపా, ఆఫ్రికా వాసులు మాతృభాషల్లో చేసిన రచనలు అనతికాలంలోనే ఆంగ్లంలోకి తర్జుమా అవుతున్నాయి. అదేసమయంలో భారతీయులు తమ మాతృభాషల్లో చేసిన రచనలు ఆంగ్లంలోకి అనువాదం కాకుండా వెనకబడి ఉన్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో భాషా విశ్వవిద్యాలయాలు ఉన్నా గురజాడవారి ‘కన్యాశుల్కం’ ఆంగ్ల అనువాదానికి శతాబ్ద కాలం పట్టడం ఇందుకో ఉదాహరణ. రచనా వ్యాసంగంపై మక్కువ చూపే భారతీయుల సంఖ్య అత్యల్పం. రచనాభ్యాసం గురించి మన పాఠ్యాంశాల్లో మచ్చుకైనా ప్రస్తావన ఉండదు. ప్రాంతీయ భాషల తర్జుమాకు అనువాద విశ్వవిద్యాలయాలు నెలకొల్పాల్సిన ఆవశ్యకత ఉంది. వర్ధమాన రచయితలను వెన్నుతట్టి, అనువాద సాహిత్యానికి పెద్దపీట వేసి అంతర్జాతీయ పురస్కారాల వైపు యువ రచయితలను ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత విద్యాసంస్థలు, ప్రభుత్వాలపై ఉంది!

-డాక్టర్​ గుజ్జు చెన్నారెడ్జి
(రచయిత- అసోసియేట్​ ప్రొఫెసర్​, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం)

ABOUT THE AUTHOR

...view details