ఏడేళ్ల క్రితం దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేకెత్తించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషులకు చివరి సమయం ఆసన్నమైంది. ఈ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి తిహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉరిశిక్ష అమలు దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు దోషులను అడగ్గా.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదట. ఈ విషయాన్ని తిహార్ జైలు వర్గాలు వెల్లడించాయి.
నిబంధనల ప్రకారం..
మరణశిక్ష పడిన దోషులు చివరి కోరికగా తమ కుటుంబసభ్యులను కలుసుకోవాలని అడగొచ్చు. వారి ఆస్తులను తమకిష్టమైన వారికిచ్చేలా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అయితే ఈ రెండు విషయాలపై జైలు అధికారులు నిర్భయ దోషులను అడగ్గా.. వారు మౌనంగా ఉన్నారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఉరిశిక్ష అమలు మళ్లీ వాయిదా పడుతుందని దోషులు ధీమాగా ఉన్నట్లు కన్పిస్తోందని జైలు వర్గాలు చెబుతున్నాయి.