తూర్పు లద్దాఖ్ సరిహద్దులో భారత్-చైనా బలగాల మధ్య ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగడం లేదని భారత సైన్యం వెల్లడించింది. ఇరు దేశాల సైనికులకు మధ్య ఘర్షణ చెలరేగుతున్నట్లు దృశ్యాలున్న ఓ వీడియో.. సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితులు ప్రశాంతంగానే ఉన్నాయని పేర్కొంది.
"మీడియాలో ప్రసారం అవుతున్న వీడియోలోని దృశ్యాలు ధ్రువీకరించినవి కావు. సరిహద్దులోని ప్రస్తుత పరిస్థితులను వాటితో ముడిపెట్టడం హేయం. ప్రస్తుతం ఎలాంటి ఘర్షణలు జరగడం లేదు."
-భారత సైన్యం
సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇరు దేశాల సైన్యాధికారులు సంప్రదింపులు, చర్చలు జరుపుతున్నట్లు సైన్యం తెలిపింది. జాతీయ భద్రతను ప్రభావితం చేసే సమస్యలను సంచలనాత్మకం చేసే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు స్పష్టం చేసింది. సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులున్నట్లు చూపే దృశ్యాలను ప్రసారం చేయవద్దని మీడియాను కోరింది.
అయితే వీడియోలో ఉన్న దృశ్యాలు ఇటీవల జరిగిన ఘర్షణలకు సంబంధించినవా? కాదా? అనే విషయంపై మాత్రం సైన్యం స్పష్టత ఇవ్వలేదు.
తూర్పు లద్దాఖ్ పాంగాంగ్ ప్రాంతంలో భారత్-చైనా బలగాలకు ఘర్షణ జరిగినట్లు వీడియోలో దృశ్యాలున్నాయి. మన సైనికులు గాయపడినట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.