తెలంగాణ

telangana

By

Published : May 25, 2020, 12:44 PM IST

ETV Bharat / bharat

ఆన్​లైన్​ స్నేహాలపై 'సీబీఎస్​ఈ' ప్రత్యేక పాఠాలు!

లాక్​డౌన్​తో ప్రజలు ఆన్​లైన్​ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో యువత ముందంజలో ఉన్నారు. అంతర్జాలంతో ఎంత ఉపయోగం ఉందో.. అందే ప్రమాదం ఉంది. సైబర్​ నేరాలు పెరిగిపోతున్నాయి. ఈ సందర్భంగా వర్చువల్​ ప్రపంచంలో యువత తమ భద్రత కోసం సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ) హ్యాండ్​ బుక్​ విడుదల చేసింది. ద్వేషపూరిత అశ్లీలత, ఆన్​లైన్​ స్నేహాల్లో పరిమితులు విధించుకోవటం, ఆన్​లైన్​లో ఏదైనా సమస్య ఎదుర్కొంటే పెద్దలకు తెలపటం వంటివి ముఖ్యమైన అంశాలుగా అందులో పేర్కొన్నారు.

CBSE's cyber safety lessons for teens
ఆన్​లైన్​ స్నేహాలపై 'సీబీఎస్​ఈ' సైబర్​ భద్రత పాఠాలు!

లాక్​డౌన్​తో బోధనా కార్యక్రమాలు పూర్తిగా ఆన్​లైన్​లోకి వెళ్తోన్న క్రమంలో.. విద్యార్థులు డిజిటల్​ ప్రపంచానికి చేరువవుతున్నారు. ఇటీవల బయటపడిన 'బోయిస్​ లాకర్​ రూమ్'​ గ్రూప్​ కేసు వల్ల ఆన్​లైన్​ బెదిరింపుల ఆందోళనలూ పెరిగాయి. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​ ప్రపంచంలో యువత తమ భద్రతను నిర్ధరించుకోవటానికి పలు మార్గదర్శకాలను విడుదల చేసింది సెంట్రల్​ బోర్డ్​ ఆఫ్​ సెకండరీ ఎడ్యుకేషన్​ (సీబీఎస్​ఈ).

ద్వేషపూరిత అశ్లీలత (రివేంజ్​ పోర్నోగ్రఫీ), ఆన్​లైన్​ స్నేహాల్లో పరిమితులు విధించుకోవటం, స్నేహితులను అంచనా వేయటం, సమస్యలు ఎదుర్కొన్నప్పుడు పెద్దలకు తెలపటం వంటివి సీబీఎస్​ఈ విడుదల చేసిన పాఠాల్లోని ముఖ్యమైన అంశాలు.

9-12వ తరగతుల విద్యార్థుల కోసం సైబర్​ భద్రత హ్యాండ్​బుక్​ను విడుదల చేసింది సీబీఎస్​ఈ. ఇందులో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు సైబర్​ నేరాల విషయంలో ఏమి చేయాలి? ఏమి చేయకూడదు అనేది ప్రస్తావించింది.

"ఆన్​లైన్​ స్నేహాలతో పాటు నిజ జీవితంలోని స్నేహితులతో ఆన్​లైన్​లో సంభాషించే అంశంపై విద్యార్థులు పరిమితులు విధించుకోవాలి. రాతపూర్వక సమాచారం, ఫొటోలు, వీడియోలను పంచుకునే విషయంలోనూ జాగ్రత్త అవసరం. ఆన్​లైన్​లో ఉన్నప్పుడు ఎవరు చూస్తున్నారో నియంత్రించలేకపోవటం, నమ్మకాన్ని దుర్వినియోగం చేయటం, ప్రతిష్టకు భంగం కలిగించటం వంటివి జరుగుతాయని గుర్తుంచుకోవాలి. యుక్తవయస్సు వారు లింగ సంబంధాలను అర్థం చేసుకోవాలి. బాలికలు తమతో సమానమనే విషయాన్ని బాలురు తెలుసుకొని గౌరవించుకోవాలి.

సంబంధాలలో అంగీకారం అనేది ఒక ముఖ్యమైన భాగం. విశ్వాసంతో పంచుకున్న చిత్రాలు, వీడియోలు, ఇతర అంశాలను అవతలి వ్యక్తి అనుమతి లేకుండా సామాజిక మాధ్యమాల్లో పంచుకోకూడదు. ఆ వ్యక్తి తమతో రిలేషన్​షిప్​ కొనసాగించాలనుకోకపోవచ్చు. ఎదుటి వ్యక్తి భావాలను గౌరవించాలి. స్నేహితుల నుంచి తిరస్కరణను ఎదుర్కోవటం యువత నేర్చుకోవాలి."

– బోర్డు సీనియర్​ అధికారి.

పిల్లలను శక్తిమంతులుగా తీర్చిదిద్దాలి..

ఇతరులు మన సమాచారాన్ని ఎలా సేకరిస్తారు? ఎలా ఉపయోగించుకుంటారో వారికి తెలియజేయాలని తల్లిదండ్రులకు సూచించింది బోర్డు.

" ప్రస్తుతం భారత్​లో డిజిటల్​ విభాగంలో కనీస వయస్సు అనేదు లేదు. ఆఫ్​లైన్​లో శారీరక, లైంగిక విషయాలను పంచుకునేందుకు ఇబ్బంది పడే వ్యక్తులు ఉంటే.. వారు ఒక్కోసారి ఆన్​లైన్​లో వాటి కోసం వెతకొచ్చు. అలాంటి వారికి హాని చేసే ఉద్దేశంతో కొందరు సైబర్​ నేరగాళ్లు ఫేక్​ అకౌంట్లు రూపొందించి స్నేహం చేస్తారు.

స్నేహితులుగా మారిన తక్కువ సమయంలోనే తమ గురించి ఆన్​లైన్​ స్నేహితులు ఎక్కువగా పొగిడినట్లు కనిపిస్తే వారిపట్ల జాగ్రత్తగా ఉండాలి. లైంగికంగా అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను పంపాలని అడిగే వారితో మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా కలవాలని అడిగేవారి ఫ్రెండ్​ రిక్వెస్ట్​ను ఎప్పుడూ అంగీకరించవద్దు. మీరు అసభ్యకరమైన చిత్రాలు అలాంటి వారితో పంచుకుంటే వారు వాటిని ఇతరులతో పంచుకోవటం, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసే అవకాశం ఉంది. అంతే కాదు మిమ్మల్ని బ్లాక్​ మెయిల్​ చేయొచ్చు."

- సీబీఎస్​ఈ హ్యాండ్​ బుక్​

ద్వేషపూరిత అశ్లీలత ముప్పుపై హెచ్చరిక..

" 14-18 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న యువత ఎక్కువగా ద్వేషపూరిత అశ్లీలతకు బాధితులుగా మారుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయం. కొందరు యువత స్నేహం చేసి తెగదెంపులు చేసుకున్న క్రమంలో.. సామాజిక మాధ్యమాల్లో తమ అసభ్యకర ఫోటోలను గుర్తించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చిత్రాలు వైరల్​గా మారితే తోటి స్నేహితులను వేధించటం, అవమానించటం చేస్తారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. ఆన్​లైన్​ సంబంధాలు ప్రమాదకరమని గుర్తించిన యువతి తన స్నేహితులతో మాట్లాడటం మానేసిన క్రమంలో.. ఆ యువతి అంటే అసూయపడే క్లాస్​మెట్​, మాజీ ప్రియుడు లేదా ఇతరులు తనను లక్ష్యంగా చేసుకోవచ్చు" అని పేర్కొంది సీబీఎస్​ఈ బోర్డు.

బోయిస్​ లాకర్​ రూమ్​..

కొద్ది రోజుల క్రితం అసభ్యకర సంభాషణలు, ఫొటోలు, వీడియోలను పంచుకునేందుకు ఇన్​స్టాగ్రామ్​లో బోయిస్​ లాకర్​ రూమ్​.. అనే గ్రూప్​ రూపొందించినట్లు వెలుగులోకి వచ్చింది. ఆ ఘటనతో ఆన్​లైన్​ స్నేహాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ గ్రూప్​లోని కొందరి మధ్య జరిగిన అసభ్యకరమైన సంభాషణలకు చెందిన స్క్రీన్​ షాట్లను పోస్ట్​ చేశారు. అందులో కొంత మంది దిల్లీలోని ప్రముఖ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వారి వయస్సు కేవలం 13 ఏళ్లే. బాలికల ఫొటోలతో పాటు వారు చూసిన వాటి గురించి అసభ్యంగా మాట్లాడుకోవటం చేశారు.

బోయిస్​ లాకర్​ రూమ్​ కేసులో దర్యాప్తు చేస్తున్న క్రమంలో స్నాప్​షాట్​లో జరిగిన ఓ సంభాషణపై పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఓ బాలుడి గురించి తెలుసుకునేందుకు ఓ అమ్మాయి.. అబ్బాయిలా మాట్లాడుతూ లైంగిక దాడికి ప్రణాళిక వేసినట్లు గుర్తించారు.

ABOUT THE AUTHOR

...view details