పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై పలువురు ప్రతిపక్ష నేతలు మరోమారు కేంద్రంపై విమర్శల దాడి చేశారు. మహమ్మారిని ఒక సాకుగా చూపి.. ప్రశ్నించే గొంతుకను అణచివేసేందుకు చేసిన ప్రయత్నమేనని ఆరోపించారు.
కేంద్రంపై మరోమారు మండిపడింది కాంగ్రెస్. ప్రశ్నోత్తరాల రద్దు నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని అణచివేయటం, పార్లమెంటరీ వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నమని ఆరోపించారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. పార్లమెంటు లోపల, బయట ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని వెల్లడించారు.
భయానక చిత్రం..
ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయటంపై విమర్శలు గుప్పించారు బహుజన సమాజ్ పార్టీ లోక్‌సభ ఎంపీ కున్వర్ దనీశ్ అలీ. 'ఎవరైనా ట్వీట్ చేస్తే అది ధిక్కారం, నేరుగా ప్రశ్నిస్తే అది రాజద్రోహం. ప్రజల తరఫున ప్రశ్నించేందుకు మిగిలి ఉన్న ఒకే ఒక్క అవకాశం పార్లమెంటు. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ఆ అవకాశాన్నీ ప్రభుత్వ దూరం చేసింది. సరికొత్త భారత్‌లో ఇది భయానక చిత్రం' అని పేర్కొన్నారు.