భారత అంతరిక్ష పరశోధన సంస్థ(ఇస్రో)ను ప్రవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదని ఛైర్మన్ శివన్ పునరుద్ఘాటించారు. అంతరిక్ష రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలతో.. ఇస్రో ప్రైవేటీకరణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇస్రో ఏర్పాటు చేసిన ఓ వెబినార్లో ఈ వ్యాఖ్యలు చేశారు శివన్.
"అంతరిక్ష పరిశోధనల్లో గమ్యాలను చేరుకోవడంపైనే ఇస్రో దృష్టిపెట్టింది. అభివృద్ధి కార్యకలాపాలు తోడైతే.. తన వనరులను ఉపయోగించుకుని ఇస్రో మరింత సమర్థంగా పనిచేయగలుగుతుంది. అందుకే అందరికీ మళ్లీ చెబుతున్నా. అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టినంత మాత్రాన.. ఇస్రోను ప్రైవేటీకరిస్తున్నట్టు కాదు. ఇది ఓ అపోహ మాత్రమే. ఇంతకు ముందు ఇస్రో ఎలా ఉండేదో.. ఇప్పుడు కూడా అలాగే పనిచేస్తుంది."