వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న తాము ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే ఉన్నా ఒత్తిడితో మాత్రం ఒప్పందాలను ఒప్పుకొనేది లేదని స్పష్టం చేశారు భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్. గణతంత్ర దినోత్సవం రోజు దిల్లీలో జరిగిన ఘటనలపై ఎన్నేళ్లు కారాగారంలో ఉండడానికైనా తాము సిద్ధమేనని చెప్పారు.
ఉద్యమంతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ఆదివారం గాజీపుర్ సరిహద్దు వద్ద ఈటీవీ భారత్ ప్రతినిధికి ఇచ్చిన ముఖాముఖిలో టికాయిత్ తెలిపారు. చర్చలకు ప్రధాని నరేంద్ర మోదీ చొరవ చూపడాన్ని ఆయన ఆహ్వానించారు. తమపై ఒత్తిడి పెంచి ఒప్పందాన్ని చేసుకోవాలంటే మాత్రం కుదరదని తేల్చిచెప్పారు.
''ప్రధానమంత్రి అందరికీ ప్రధానే. మేం ఆయన్నీ గౌరవిస్తాం. రైతుల ఆత్మాభిమానానికీ విలువనిస్తాం. రైతుల డిమాండ్లపై భవిష్యత్తులోనూ ప్రభుత్వంతో చర్చిస్తాం. ఫలితం ఎలా ఉంటుందన్నది చర్చలకు కూర్చున్న తర్వాతే తెలుస్తుంది.''
- రాకేశ్ టికాయిత్, రైతు సంఘం నేత
భవిష్యత్తు కార్యాచరణ ఏమిటి, ఉద్యమాన్ని ఎలా ముగించబోతున్నారు అనే ప్రశ్నలకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
ఇదీ చూడండి: రైతు గుండె చప్పుడు- రాకేశ్ టికాయిత్!
రైతుల హక్కుల కోసమే..
జనవరి 26 నాటి హింసాత్మక ఘటనల నేపథ్యంలో బీకేయూ ఇకపై మరింత అప్రమత్తంగా ఉంటుందని టికాయిత్ చెప్పారు. దుష్టశక్తుల్ని ఉద్యమానికి దూరంగా పెడతామని అన్నారు.
''దుష్టశక్తుల్ని ఉద్యమానికి దూరంగా పెడతాం. ఎవరు మాతో ఉన్నారు. ఎవరు లేరనేది గుర్తించడం ఇప్పుడు మాకు సులభమే. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు ఇచ్చేవారిని, మీడియాపై దురుసుగా ప్రవర్తించేవారిని బీకేయూ సహించదు. మీడియాను, ప్రభుత్వాన్ని బీకేయూ గౌరవిస్తుంది.''
- రాకేశ్ టికాయిత్
తాను 2022లో జరిగే ఉత్తర్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సాగు చట్టాల అంశాన్ని రాజకీయ పార్టీలు పార్లమెంటులో లేవనెత్తితే మంచిదని అభిప్రాయపడ్డారు.
''మా పోరాటాలు కేవలం రైతుల హక్కుల కోసమే. నాకు ఎలాంటి రాజకీయపరమైన ఆకాంక్షలు లేవు. ఉద్యమం రాజకీయాలకు అతీతంగానే కొనసాగుతుంది. ఈ రోజు నుంచి మా వేదికలపైనా, మైకుల వద్ద రాజకీయ నేతలకు నిషేధం ఉంటుంది. నిజానికి ఇంతవరకు మా వేదికలపై ఏ నాయకుడినీ అనుమతించలేదు. కేవలం మైకులో మాట్లాడేందుకు మాత్రం కొందరికి అవకాశమిచ్చాం. ఇకపై అదీ ఉండదు. రాజకీయ నేతలు వచ్చి ఉద్యమంలో పాల్గొంటామంటే ఆహ్వానిస్తాం. మా దీక్షా స్థలాల నుంచి ఓట్లు అడిగేందుకు మాత్రం ఆస్కారం ఇచ్చేది లేదు. నాపై నమోదైన కేసులలో జైలుకు వెళ్లడానికి సిద్ధమే. అయితే నాపై కేసు పెట్టడానికి కారణాలను పోలీసులు చూపించాలి. నాపై దేశద్రోహం కేసు బనాయిస్తే ఎన్నేళ్లయినా జైల్లో ఉంటాను. దర్యాప్తు జరిగితే నిజమేమిటో తేటతెల్లమవుతుంది.''
- రాకేశ్ టికాయిత్, రైతు సంఘం నేత
ఇదీ చూడండి:దిల్లీ హింసలో మరో 50మందికి నోటీసులు