మహారాష్ట్ర రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. భాజపాతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన శివసేన.. తాజా పరిణామాలతో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు కన్పిస్తోంది. భాజపా అహంకార ధోరణి వల్లే రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితులు చోటుచేసుకున్నాయని శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. భాజపా మాట మీద నిలబడనప్పుడు ఇక రెండు పార్టీల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండబోవని స్పష్టం చేశారు.
చెరిసగం పాలనపై భాజపా వెనక్కి తగ్గడం మహారాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని ఆయన విమర్శించారు. భాజపా ప్రతిపక్షంలో కూర్చోడానికి సిద్ధంగా ఉంది కానీ.. 50-50 సూత్రం మాత్రం అనుసరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
"భాజపాది అహంకారం. అందుకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు నిరాకరించి.. తనను అతిపెద్ద పార్టీగా గెలిపించిన మహారాష్ట్ర ప్రజలను అవమానించింది. మాతో చర్చలకు భాజపా సిద్ధంగా లేనప్పుడు రెండు పార్టీల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి? భాజపా-శివసేన మధ్య బంధం ఉందని మేం అనుకోవట్లేదు. జమ్ముకశ్మీర్‌లో పీడీపీతోభాజపా పొత్తు పెట్టుకున్నప్పుడు.. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో శివసేన ఎందుకు కలవకూడదు? రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ అంతర్గత విభేదాలను పక్కనబెట్టి ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు రావాలి."
- సంజయ్ రౌత్, శివసేన సీనియర్ నేత.
ఈ సందర్భంగా శివసేన ఎంపీ అరవింద్ సావంత్ రాజీనామా గురించి కూడా ప్రస్తావించారు రౌత్. పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆదేశాలతోనే అరవింద్ కేంద్రమంత్రి పదవి నుంచి తప్పుకున్నారని వెల్లడించారు.