బాలీవుడ్ ప్రముఖ నటి ఊర్మిళా మాతోంద్కర్ ఇటీవలే శివసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే.. అది నటి కంగనా రనౌత్‌తో వివాదం వల్ల తీసుకున్న నిర్ణయం కాదని స్పష్టం చేశారు ఊర్మిళ. తనకు కంగనతో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదని తేల్చిచెప్పారు. కంగన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. మహారాష్ట్ర, మరాఠీ ప్రజలు, ముంబయి పోలీసులకు అపఖ్యాతి తెచ్చాయని ఈటీవీ భారత్ ముఖాముఖిలో అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటికీ.. రాజకీయాలకు దూరంగా లేనని తెలిపారు ఊర్మిళ. తన తండ్రి జాతీయ సేవా దళంలో పనిచేసేవారని, దాంతో తనకు చిన్న తనం నుంచే సామాజిక సేవ అలవడినట్లు చెప్పారు. " ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించవచ్చో చిన్నతనంలోనే అవగాహన ఉంది. కొంత మందితో విభేదాల కారణంగానే కాంగ్రెస్ పార్టీని వీడా. కొద్ది నెలల క్రితం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసి.. సాహిత్యం, కళారంగంలో తమ పార్టీకి బలం అవసరమని.. శాసనమండలికి రావాలని పిలిచారు. అప్పుడే ఠాక్రేకు ఓకే చెప్పాను" అని తెలిపారు.